LOADING...
Stock Market: కోలుకున్న స్టాక్ మార్కెట్.. వరుస నష్టాలకు బ్రేక్..
కోలుకున్న స్టాక్ మార్కెట్.. వరుస నష్టాలకు బ్రేక్..

Stock Market: కోలుకున్న స్టాక్ మార్కెట్.. వరుస నష్టాలకు బ్రేక్..

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2026
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గత మూడు ట్రేడింగ్ సెషన్లలో భారీ నష్టాలు ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం కొంత ఊపిరి పీల్చుకున్నాయి. అణు ఒప్పందం అంశంలో ఇరాన్ కొంత మేర వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా ఉందన్నసంకేతాలు ఆ దేశ విదేశాంగ మంత్రి వ్యాఖ్యల ద్వారా వెలువడటం మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపింది. దీనికితోడు కనిష్ఠస్థాయిల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం,అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన కొన్ని సానుకూల సంకేతాలు కూడా సూచీలకు మద్దతుగా నిలిచాయి. అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి కొంత బలపడటం,ఆయిల్,గ్యాస్ రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు పెరగడం కూడా మార్కెట్‌కు ఊతమిచ్చాయి. ఈపరిణామాల నేపథ్యంలో చివరికి సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభాలతో రోజును ముగించాయి.

వివరాలు 

నిఫ్టీ @ 24,765

గత సెషన్‌లో 79,116 వద్ద ముగిసిన సెన్సెక్స్, గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే 400 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత రోజంతా లాభాల దిశలోనే కదిలింది. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు మరింత పెరగడంతో సూచీ లాభాలు విస్తరించాయి. ఒక దశలో దాదాపు 1,200 పాయింట్లు పెరిగి 80,303 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సెన్సెక్స్ 811 పాయింట్లు పెరిగి 79,927 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్‌ను అనుసరిస్తూ లాభాల దిశగా కదిలింది. చివరికి నిఫ్టీ 285 పాయింట్లు పెరిగి 24,765 వద్ద స్థిరపడింది.

వివరాలు 

867 పాయింట్లు పెరిగిన నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్

సెన్సెక్స్,నిఫ్టీలో మాజగాన్ డాక్, నాల్కో, బ్లూ స్టార్, బీఎస్ లిమిటెడ్, పెట్రోనాట్ ఎల్‌ఎన్‌జీ వంటి షేర్లు లాభాలను నమోదు చేశాయి. మరోవైపు ఆయిల్ ఇండియా, కేపీఐటీ టెక్, ఎంఫసిస్, కోఫోర్జ్, పెర్సిస్టెంట్ వంటి షేర్లు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 867 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా సుమారు 300 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.60గా నమోదైంది.

Advertisement