LOADING...
Stock Market: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల ప్రభావం.. 900 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల ప్రభావం.. 900 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్

Stock Market: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల ప్రభావం.. 900 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2026
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. బుధవారం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాల బాట పట్టడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 10.50 గంటల సమయానికి సెన్సెక్స్ 851 పాయింట్లు కోల్పోయి 73,803 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 243 పాయింట్లు పడిపోయి 23,240 స్థాయికి చేరుకుంది. మార్కెట్లోని దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడవుతుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. కువైట్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ నేరుగా క్షిపణి దాడులు జరపడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చర్చల ద్వారా సద్దుమణుగుతాయని భావించిన మార్కెట్లకు ఈ పరిణామం ఊహించని షాక్‌గా మారింది.

వివరాలు 

ఐటీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి

యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.88 శాతం పెరిగి 96.84 డాలర్లకు చేరుకుంది. మార్కెట్ పతనంలో ఐటీ రంగ షేర్లు ప్రధానంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్ 6.65 శాతం పడిపోగా, పర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్ 5.16 శాతం నష్టపోయింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి భారీ ఐటీ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో నిఫ్టీపై ప్రతికూల ప్రభావం పడింది.

వివరాలు 

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.70

అయితే మార్కెట్ మొత్తం నష్టాల్లో ఉన్నప్పటికీ కొన్ని షేర్లు లాభాల్లో కొనసాగాయి. కాంకర్డ్ బయోటెక్ షేర్ 7.83 శాతం, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 5 శాతం, ఎన్‌హెచ్‌పీసీ 4.47 శాతం మేర లాభపడి ట్రేడవుతూ మార్కెట్‌కు కొంత మద్దతుగా నిలిచాయి. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.70 వద్ద కొనసాగుతోంది.

Advertisement