IndiGo: ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 'లైట్' టికెట్ ఆప్షన్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
విమానయాన సంస్థ ఇండిగో ఎకానమీ క్లాస్ ప్రయాణికుల కోసం 'ఇండిగో లైట్' పేరుతో కొత్త ఎంట్రీ-లెవల్ ఫేర్‌ను ప్రవేశపెట్టింది. కేవలం క్యాబిన్ బ్యాగేజీతో ప్రయాణించే వారికి ఈ టికెట్ అందుబాటులో ఉండనుంది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల టికెట్ ఎంపికలను విస్తరించే క్రమంలో ఈ కొత్త ఫేర్‌ను తీసుకొచ్చినట్లు సంస్థ వెల్లడించింది. జూలై 1 నుంచి ఇండిగో అధికారిక వెబ్‌సైట్,మొబైల్ యాప్,కాంటాక్ట్ సెంటర్ ద్వారా చేసే బుకింగ్‌లకు ఈ ఫేర్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ టికెట్‌తో ప్రయాణాలు జూలై 15 నుంచి ప్రారంభమవుతాయి. దేశీయ,అంతర్జాతీయ నాన్‌స్టాప్ మార్గాల్లో వన్‌వే, రౌండ్‌ట్రిప్, మల్టీసిటీ బుకింగ్‌లకు ఇది వర్తిస్తుంది. పెద్దలతో పాటు చిన్నారుల టికెట్లకూ ఈ ఫేర్ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.
వివరాలు
అవసరానికి అనుగుణంగా టికెట్ ఎంపిక
కేవలం క్యాబిన్ బ్యాగేజీతో ప్రయాణించే ప్రయాణికులు తాము వినియోగించే సేవలకు మాత్రమే చెల్లించే అవకాశం ఈ ఫేర్ ద్వారా కలుగుతుందని ఇండిగో పేర్కొంది. దీంతో ప్రయాణ ఖర్చులపై మరింత నియంత్రణతో పాటు అవసరానికి అనుగుణంగా టికెట్ ఎంపిక చేసుకునే సౌలభ్యం లభిస్తుందని తెలిపింది. ఇదిలా ఉండగా, ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 0.12 శాతం తగ్గి రూ.5,362 వద్ద కొనసాగాయి. మరోవైపు, దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మరో ఊరటనిచ్చింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరను లీటరుకు రూ.5 మేర తగ్గించింది. దీంతో జూలై 1 నుంచి దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధర లీటరుకు రూ.110గా అమల్లోకి వచ్చింది.
వివరాలు
పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై సవరణ
అదే సమయంలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై విధించే సుంకాలను కూడా కేంద్రం సవరించింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన తాజా నిర్ణయం ప్రకారం పెట్రోల్‌పై లీటరుకు రూ.4,డీజిల్‌పై రూ.8.50, ఏటీఎఫ్‌పై రూ.7.50 ఎగుమతి సుంకం విధించనుంది. అయితే దేశీయ మార్కెట్లో విక్రయించే పెట్రోల్,డీజిల్‌పై ఎక్సైజ్ సుంకంలో ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే ఎగుమతి సుంకాల నుంచి మినహాయింపు పొందిన దేశాల జాబితాను కూడా కేంద్రం విస్తరించింది. ఇప్పటికే ఉన్న నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు ఇప్పుడు మారిషస్, మాల్దీవులను కూడా ఈ జాబితాలో చేర్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రతి పక్షం నిర్వహించే సమీక్షలో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.