Infosys bonus:ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. నవంబర్ శాలరీతో బాటు 85 శాతం పనితీరు ఆధారిత బోనస్ చెల్లింపులు
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హులైన ఉద్యోగులకు సగటున 85 శాతం మేర పనితీరు ఆధారిత బోనస్ ఇవ్వడానికి సంస్థ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించిన సందర్భంగా, ఈ బోనస్ ప్రకటించారు. నవంబర్ నెల వేతనంతో పాటు ఈ బోనస్ చెల్లించబడుతుందని సంస్థ స్పష్టం చేసింది. బోనస్ మొత్తాన్ని ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు మరియు సహకారం ఆధారంగా నిర్ణయించనున్నట్లు పేర్కొంది. ఈ బోనస్ చెల్లింపుల గురించి ఇప్పటికే ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్స్ పంపించింది. క్యూ2లో అధిక వృద్ధిని సాధించడంలో ఉద్యోగుల సహకారం కీలకమైనదని, భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతను కొనసాగించాలని సంస్థ అభిలషించింది.
ఈ బోనస్ లాభదాయకం
ముఖ్యంగా డెలివరీ, సేల్స్ యూనిట్లలో పనిచేసే మిడ్ మరియు జూనియర్ స్థాయి ఉద్యోగులకు ఈ బోనస్ లాభదాయకమని ఎకనామిక్ టైమ్స్ నివేదికలో పేర్కొనబడింది. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ.6,506 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. సంస్థ ఆదాయం 5.1 శాతం వృద్ధితో రూ.40,986 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.75% నుండి 4.5% వరకు వృద్ధి అంచనాలను వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో బోనస్ ప్రకటించడం విశేషమైంది. ఇన్ఫోసిస్ సంస్థలో ఫ్రెషర్లు, టెక్నికల్ లీడర్లు E0-E2 కేటగిరీగా, మిడ్ లెవల్ ఉద్యోగులు E3-E6 కేటగిరీగా, సీనియర్ ఉద్యోగులు E7 ఆపైన కేటగిరీగా పరిగణించబడతారు. అయితే, ఏ కేటగిరీకి ఎంత బోనస్ చెల్లించబడుతుందో ప్రత్యేకంగా సంస్థ వెల్లడించలేదు.