LOADING...
Infosys,TCS to Tech Mahindra: ఐటీ షేర్లకు భారీ షాక్‌.. ఒక్కరోజులో రూ.1.3 లక్షల కోట్లు నష్టం
ఐటీ షేర్లకు భారీ షాక్‌.. ఒక్కరోజులో రూ.1.3 లక్షల కోట్లు నష్టం

Infosys,TCS to Tech Mahindra: ఐటీ షేర్లకు భారీ షాక్‌.. ఒక్కరోజులో రూ.1.3 లక్షల కోట్లు నష్టం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్ఫోసిస్, టీసీఎస్ నుంచి టెక్ మహీంద్రా వరకు ఐటీ రంగానికి చెందిన షేర్లు గురువారం(ఫిబ్రవరి 12)భారీగా పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ షేర్లలో తీవ్ర అమ్మకాలు చోటుచేసుకోవడం,ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ఆధారిత స్టార్టప్‌లు సాంప్రదాయ ఐటీ కంపెనీల వ్యాపారాన్ని దెబ్బతీయవచ్చన్న భయాలు మళ్లీ తెరపైకి రావడం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు,అమెరికాలో జనవరి నెల ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించి బలంగా రావడంతో ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న ఆశలు తగ్గిపోయాయి. ఈ పరిణామాలన్నీ కలిసి ఇన్వెస్టర్లలో నెగటివ్ భావన పెంచాయి. ఫలితంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఒక దశలో 4.6 శాతం పడిపోయి 33,471 స్థాయికి చేరి,ఆ రోజు మార్కెట్‌లో అత్యంత దారుణంగా ప్రదర్శించిన రంగంగా నిలిచింది.

వివరాలు 

2026లో ఇప్పటివరకు దాదాపు 11 శాతం పడిపోయిన నిఫ్టీ ఐటీ ఇండెక్స్

ఒక్క రోజులోనే ఐటీ కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.1.3 లక్షల కోట్ల మేర తగ్గి, మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.27.6 లక్షల కోట్లకు దిగజారింది. గత కొంతకాలంగా ఈ రంగంపై ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. 2025 క్యాలెండర్ సంవత్సరంలో సుమారు 13 శాతం నష్టపోయిన నిఫ్టీ ఐటీ ఇండెక్స్, 2026లో ఇప్పటివరకు దాదాపు 11 శాతం పడిపోయింది. గత మూడు నెలల్లో 9 శాతం, ఒక్క నెలలోనే దాదాపు 12 శాతం తగ్గడం ద్వారా ఐటీ రంగంలో కొనసాగుతున్న అమ్మకాల తీవ్రత స్పష్టమవుతోంది. ఏఐ వేగంగా అభివృద్ధి చెందడం వల్ల ధరలపై పట్టు తగ్గిపోవడం, కొత్త డీల్‌లు దక్కకపోవడం, భవిష్యత్ లాభాలపై అనిశ్చితి పెరగడం వంటి భయాలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి.

వివరాలు 

4 శాతం పడిపోయిన ప్రధాన కంపెనీల షేర్లు

ఈ నేపథ్యంలో కొఫోర్జ్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీమ్ వంటి షేర్లు 5 శాతం కంటే ఎక్కువ నష్టపోగా, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ప్రధాన కంపెనీల షేర్లు కూడా 4 శాతం పైగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలోనూ బలహీనత కొనసాగడంతో దేశీయ ఐటీ రంగంపై మరింత ఒత్తిడి పెరిగింది. అమెరికా ఉద్యోగ గణాంకాలు బలంగా ఉండటంతో వడ్డీ రేట్లు ఎక్కువ కాలం యథాతథంగా ఉండే అవకాశాలు కనిపిస్తుండగా, డాలర్ బలపడటం కూడా ఐటీ వంటి రేట్-సెన్సిటివ్ రంగాలకు ప్రతికూలంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ రంగంలో రికవరీపై స్పష్టత లేకపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement