
Salil Parekh: 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంటాం.. ఏఐ, రీస్కిల్లింగ్‌పై ప్రధానంగా దృష్టి: సలీల్ పరేఖ్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇన్ఫోసిస్ సంస్థ ముందుకు సాగుతోందని ఆ సంస్థ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించినట్టు ప్రముఖ ఆంగ్ల మీడియా నివేదికలు పేర్కొన్నాయి. 2025లో కాలేజీ నుంచి ఉత్తీర్ణులైన 20 వేల మందిని నియమించాలనే యోచనలో ఉన్నామని ఆయన పేర్కొన్నట్టు ఆ వార్తలు తెలియజేశాయి. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో 17,000 మందిని సంస్థలో నియమించుకున్నట్టు సలీల్ పరేఖ్ తెలిపారు.
వివరాలు
2.75 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడి
కృత్రిమ మేధస్సు (ఏఐ) మరియు రీస్కిల్లింగ్‌పై కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఈవో వివరించారు. ఇన్ఫోసిస్ సంస్థ ఏఐ సాంకేతికతను ముందుగానే ఆవలంబించిందని, ఈ రంగానికి చెందిన పరిజ్ఞానాన్ని ఉద్యోగులకు అందించడంలో ముందంజలో ఉందని అన్నారు. ఇప్పటి వరకు సంస్థలో 2.75 లక్షల మంది ఉద్యోగులకు ఏఐతో పాటు సంబంధిత అంశాలపై శిక్షణ ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని సంస్థ దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు సాగుతోందని సలీల్ పరేఖ్ స్పష్టం చేశారు.
వివరాలు
12,000 మంది ఉద్యోగులను తొలగించింది
ప్రస్తుతం ఐటీ రంగంలో అనేక అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నా, ఇన్ఫోసిస్ సంస్థ ఈ పరిస్థితుల్లోనూ నియామక ప్రక్రియను కొనసాగించడమంటే విశేషమైన విషయం. ఇదే సమయంలో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఇటీవల ప్రకటించింది. ఇది భారతీయ ఐటీ రంగ చరిత్రలోనే ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద ఉద్యోగ తొలగింపుగా భావిస్తున్నారు.