Infosys: ఇన్ఫోసిస్ లో 'బలవంతపు'లేఆఫ్‌లు.. ప్రధానమంత్రి కార్యాలయానికి ట్రైనీల ఫిర్యాదు
ఈ వార్తాకథనం ఏంటి
ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.
మైసూరు క్యాంపస్‌లో పనిచేస్తున్న దాదాపు 400 మంది ట్రైనీ ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం వివాదాస్పదంగా మారింది.
ఈ పరిణామంపై కార్మిక యూనియన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తాజా సమాచారం మేరకు, ఈ వ్యవహారం ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) చేరినట్లు తెలుస్తోంది.
ఈ బలవంతపు లేఆఫ్‌ల (Trainees Layoffs)పై ట్రైనీలు పీఎంఓకి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి, దీనిపై జాతీయ మీడియా కథనాలు హైలైట్ చేశాయి.
వివరాలు
స్పందించిన కార్మిక శాఖ
ఈ తొలగింపులపై ప్రధానమంత్రి కార్యాలయానికి 100కు పైగా ఫిర్యాదులు అందినట్లు నివేదికలు చెబుతున్నాయి.
తమ ఉద్యోగాలను తిరిగి ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి తొలగింపులను నిరోధించాలని ట్రైనీలు కోరినట్లు సమాచారం.
దీనిపై కేంద్ర కార్మిక శాఖ స్పందించి, తగిన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
సంబంధిత వ్యవహారంలో కర్ణాటక కార్మిక శాఖకు ఫిబ్రవరి 25న నోటీసులు పంపినట్లు కథనాలు పేర్కొన్నాయి.
రాష్ట్ర కార్మిక శాఖ అధికారులు ఈ అంశంపై దర్యాప్తు చేసి, కేంద్రానికి నివేదిక అందించాలని సూచించినట్లు సమాచారం.
వివరాలు
400 మంది ట్రైనీలను ఇన్ఫోసిస్ లేఆఫ్
ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో, మైసూరు క్యాంపస్‌లోని సుమారు 400 మంది ట్రైనీలను ఇన్ఫోసిస్ లేఆఫ్ చేసింది.
వారిని తక్షణమే క్యాంపస్‌ను వీడాలని ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి.
దీనిపై ఇన్ఫోసిస్ స్పందిస్తూ, వరుసగా మూడు ఎవాల్యుయేషన్ పరీక్షల్లో విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ఈ పరీక్షలు సంస్థ నిబంధనలలో భాగమని, కంపెనీ అభివృద్ధికి అవసరమైనవని పేర్కొంది.
వివరాలు
వీరంతా 2022 బ్యాచ్ ఉత్తీర్ణులు
2022-23 నియామక ప్రక్రియలో భాగంగా, ఇన్ఫోసిస్ 2000 మంది ఫ్రెషర్లను ఎంపిక చేసింది.
సిస్టమ్ ఇంజినీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ వంటి పోస్టులకు ఎంపిక చేసి, అదే ఏడాది వారికి ఆఫర్ లెటర్లు ఇచ్చింది.
వీరంతా 2022 బ్యాచ్ ఉత్తీర్ణులు. అన్ని అవసరమైన పరీక్షలు పూర్తి చేసినప్పటికీ, సంస్థ వీరిని విధుల్లోకి తీసుకోవడంలో ఆలస్యం చేసింది.
దీనివల్ల ఇన్ఫోసిస్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి, అలాగే కార్మిక శాఖ వద్ద ఫిర్యాదులు నమోదయ్యాయి.
చివరకు, 2024 ఏప్రిల్‌లో, రెండు సంవత్సరాల ఆలస్యంతో వారిని ఉద్యోగాల్లోకి చేర్చింది.
అయితే, గతేడాది మైసూరు క్యాంపస్‌లో చేరిన ట్రైనీలలో సగం మందిపై ఇప్పుడు వేటు వేయడం గమనార్హం.