
Intel: ఇంటెల్ సీఈవో లిప్-బు టాన్ ఆత్మవిమర్శ.. కృత్రిమ మేధ రంగంలో వెనుకపడినట్లు అంగీకారం
ఈ వార్తాకథనం ఏంటి
కంప్యూటింగ్ రంగంలో అగ్రగామిగా పేరొందిన ఇంటెల్ సంస్థ, కృత్రిమ మేధ (AI) పోటీలో ఎంతో వెనుకబడి పోయిందని సంస్థ తాజా సీఈవో లిప్-బు టాన్ ఓపెన్‌గా అంగీకరించారు. సంస్థ ఉద్యోగులతో జరిగిన గ్లోబల్ లైవ్ వీడియో టెలికాస్ట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వెనుకబాటును అధిగమించేందుకు తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని టాన్ స్పష్టంచేశారు. గత సీఈవో పాట్ గెల్సింగర్ బాధ్యతలు వదిలిన తర్వాత తొలిసారి ఉద్యోగులతో ఆయన మాట్లాడారు.
వివరాలు
ఇప్పుడు టాప్ 10లో కూడా లేదు
''ముప్పై ఏళ్ల క్రితం మనమే ఈ రంగంలో నాయకులు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుత సెమీ కండక్టర్ పరిశ్రమలో మనం కనీసం టాప్-10లో కూడా లేం'' అని స్పష్టం చేశారు. సాంప్రదాయ మార్కెట్ల నుంచి కీలకమైన కృత్రిమ మేధ రంగానికి మారడంలో సంస్థను ఎన్నో సవాళ్లు తాకుతున్నాయని చెప్పారు. ఇప్పటికే ఈ మార్పు ఆలస్యం అయిందని, కంపెనీ పోటీ సంస్థలతో పోలిస్తే వెనుకపడిపోయిందని వివరించారు. నివిడియా ఈ రంగంలో తమ సత్తా చాటుతూ,ఏఐ చిప్‌ల అభివృద్ధిలో ముందు వరుసలో దూసుకుపోతుందని టాన్ పేర్కొన్నారు. అలాంటి స్థాయిలో నేరుగా పోటీ ఇవ్వగలిగే స్థితిలో ప్రస్తుతం ఇంటెల్ లేదన్నారు.
వివరాలు
త్వరలో సంస్థ నుంచి రానున్న 18ఏ మోడల్
అయినప్పటికీ, త్వరలో సంస్థ నుంచి రానున్న 18ఏ మోడల్ ఇంటెల్ అంతర్గత అవసరాలను సమర్థవంతంగా తీర్చగలదని తెలిపారు. సంస్థలో సమూల మార్పులు తీసుకురావడాన్ని ఒక దీర్ఘకాలిక ప్రయాణంగా (మారథాన్) ఆయన పేర్కొన్నారు. ఎన్విడియా, ఏఎండీ లాంటి సంస్థల దూకుడును ఇంటెల్ కూడా అవలంబించాల్సిన అవసరం ఉందని సీఈవో అభిప్రాయపడ్డారు. కస్టమర్లతో ఉద్యోగులు మరింత వినయంగా వ్యవహరించాలని, వారి అవసరాలకు తగిన స్పందన ఇవ్వాలని సూచించారు.
వివరాలు
టెక్నాలజీ సామర్థ్యాల్లో ఇంటెల్ స్థానం మరింత మెరుగ్గా..
ఇక ఆర్థికంగా చూస్తే కూడా ఇంటెల్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. సంస్థ ఒరెగాన్‌లోని క్యాంపస్ నుంచి ఇప్పటికే 529మంది ఉద్యోగులను తొలగించగా,ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కోతలు ఉండొచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. మార్కెట్ విలువ కూడా గణనీయంగా పడిపోయి 100 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఇది 18 నెలల క్రితం కంటే సగమే.అదే సమయంలో ఎన్విడియా మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని, ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచిన తొలి సంస్థగా గుర్తింపు పొందింది. ఇక "ఇంటెల్ టాప్-10లో లేదు"అన్న లిప్-బు టాన్ వ్యాఖ్యపై వివరణ ఇస్తూ, సంస్థ ప్రతినిధి స్పందించారు. ఆ వ్యాఖ్య మార్కెట్ విలువకు మాత్రమే సంబంధించినదని, టెక్నాలజీ సామర్థ్యాల్లో మాత్రం ఇంటెల్ స్థానం మరింత మెరుగ్గానే ఉందని స్పష్టం చేశారు.