
L and T chairman:సంక్షేమ పథకాల ప్రభావం వల్ల పని చేయడానికి ఆసక్తి తగ్గుతోంది.. ఎల్ అండ్ టీ ఛైర్మన్ వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
నిర్మాణ రంగంలో కార్మికుల వలసలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలే దీనికి కారణమని పేర్కొన్నారు.
చెన్నైలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సదస్సులో కార్మికుల కొరతపై మాట్లాడిన సుబ్రహ్మణ్యన్ తమ సంస్థలో 2.5 లక్షల మంది ఉద్యోగులు, 4 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని వెల్లడించారు.
ఉద్యోగుల సంఖ్య తగ్గడం పెద్ద సమస్య కాదని కానీ కార్మికుల లభ్యత తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.
Details
వలస వెళ్లడానికి ఇష్టపడడం లేదు
ఈ రోజుల్లో కార్మికులు అవకాశాల కోసం వలస వెళ్లడానికి ఇష్టపడటం లేదు. బహుశా స్థానికంగా వారికి సంపాదన బాగానే ఉండొచ్చు. అలాగే, అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా కారణమయ్యుండొచ్చు.
వాటివల్లే వేరే ప్రాంతాలకు వెళ్లి పనిచేయాలన్న ఆసక్తి తగ్గిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం కార్మికుల్లోనే కాదు, వైట్ కాలర్ ఉద్యోగాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని అన్నారు.
తనకు ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చినప్పుడు మా బాస్ దిల్లీలో పని చేయమని చెప్పారు. కానీ, ఇప్పుడైతే ఎవరైనా అలా అడిగితే, 'బై' అంటూ వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.
ఇటీవల సుబ్రహ్మణ్యన్ వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
Details
వారానికి 90 గంటలు పనిచేయాలి
ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? ఎంతసేపు భార్యను చూస్తూ ఉంటారు? ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉండాలని భార్యలకు చెప్పాలి.
వారానికి 90 గంటల పని చేయాలి, ఆదివారం సెలవును వదిలేయాలని ఆయన వ్యాఖ్యానించడం నెట్టింట పెను దుమారం రేపింది.
ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ఎల్ అండ్ టీ కంపెనీ తన ఛైర్మన్ వ్యాఖ్యలను సమర్థించింది.
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే, అసాధారణ కృషి అవసరమని, అసాధారణ లక్ష్యాలను చేరుకోవాలంటే ఇది అవసరమైన మార్గం అంటూ కంపెనీ వివరణ ఇచ్చింది.