Investments: ఈ సూత్రాలు పాటించిపెట్టుబడులు పెట్టాలి.. అవేమిటంటే
డబ్బు సంపాదించడం ఒక విషయమైతే, దానిని సమర్థవంతంగా వినియోగించడం మరొక విషయం. సంపాదించిన మొత్తాన్ని క్రమబద్ధంగా ఖర్చు చేయడం, భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం ద్వారా మనకు భరోసా లభిస్తుంది. ఇది సాధించడానికి కొన్ని ముఖ్యమైన సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉంది. అవి ఏమిటంటే: 30 శాతం : మీ క్రెడిట్ కార్డు పరిమితిలో 30 శాతానికి మించి వినియోగించకూడదు. ఉదాహరణకు, మీ కార్డు పరిమితి రూ.1,00,000 ఉంటే, రూ.30,000కి మించి వాడకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడైనా అతిగా ఉపయోగిస్తే, నెల మధ్యలోనే ఆ మొత్తాన్ని చెల్లించే ప్రయత్నం చేయాలి.
భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడిగా 10-15 శాతం
70 శాతం: మీ ప్రస్తుత ఆదాయంలో కనీసం 70 శాతం పదవీ విరమణ తరువాత కూడా రావాలనే లక్ష్యంతో ప్రణాళిక వేయాలి. ఉదాహరణకు, మీరు నెలకు రూ.1,00,000 సంపాదిస్తున్నట్లయితే, పదవీ విరమణ తరువాత రూ.70,000 పొందడానికి ప్రణాళికలు ఉండాలి. 10-15 శాతం మదుపు సూత్రం: మీ ఆదాయంలో 10-15 శాతం భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడిగా మళ్ళించాలి. ఉదాహరణకు, మీ నెల ఆదాయం రూ.80,000 అయితే, కనీసం రూ.12,000 పెట్టుబడికి కేటాయించాలి. రూల్ 115: మీ పెట్టుబడిపై వచ్చే రాబడి ఎంత కాలంలో మూడు రెట్లు అవుతుందో తెలుసుకోవడానికి 115 సూత్రాన్ని ఉపయోగించాలి.ఉదాహరణకు,మీరు రూ.లక్షను 8 శాతం వడ్డీతో మదుపు చేస్తే, ఆ డబ్బు మూడు రెట్లు అయ్యేందుకు 14 ఏళ్లు పడుతుంది.
ఫండ్‌లో 10 శాతం కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు
10 శాతం మించకుండా: షేర్లు లేదా ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నప్పుడు, ఒకే షేరు లేదా ఫండ్‌లో 10 శాతం కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు. మీ మొత్తం పెట్టుబడి రూ.10 లక్షలు అయితే, ఒక్క షేరు లేదా ఫండ్‌లో రూ.1 లక్షకు మించి ఉండకుండా పోర్ట్‌ఫోలియోను నిర్వహించాలి. 24 గంటల నియమం: ఏదైనా ఒక వస్తువును కొనాలనుకుంటే, కనీసం 24 గంటలు ఆలోచించి కొనాలి. వెంటనే కొనడం మానేయాలి. ఒక రోజు తర్వాత కూడా ఆ వస్తువు అవసరమా లేదా అనేది నిర్ణయించుకోవడం ద్వారా ఖర్చులను నియంత్రించవచ్చు.