SEBI: మార్కెట్ రిస్క్‌లపై అప్రమత్తంగా ఉండండి: సెబీ చైర్మన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత మూలధన మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారు తమ బాధ్యతను తాము తీసుకోవాల్సిందేనని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. మార్కెట్‌లో వచ్చే రిస్క్‌ల నుంచి రక్షించుకోవాలంటే ప్రతి ఇన్వెస్టర్ స్వయంగా పూర్తి వివరాలు తెలుసుకుని, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. సెబీ ఎన్నో వివరాలు బయటపెట్టే విధానాలు అమలు చేస్తున్నప్పటికీ, చివరికి పెట్టుబడి పెట్టాలా వద్దా అనే తుది నిర్ణయం మాత్రం పెట్టుబడిదారుడే స్వయంగా తీసుకోవాలని ఆయన తెలిపారు. బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తైన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఇదే సమయంలో,మార్కెట్‌లో తప్పుదోవ పట్టించే వారిని గుర్తించేందుకు కృత్రిమ మేధస్సు (AI) వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను SEBI వినియోగిస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
డ్రాఫ్ట్ అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్
పెట్టుబడిదారులకు సులభంగా అర్థమయ్యేలా "డ్రాఫ్ట్ అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్"(draft abridged prospectus) అనే కొత్త విధానాన్ని కూడా SEBI తీసుకొస్తోంది. సాధారణంగా 500 పేజీలకు పైగా ఉండే కంపెనీల వివరాల బదులు, ముఖ్య సమాచారం, రిస్క్ అంశాలను సంక్షిప్తంగా ఒక పత్రంలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా సులభంగా చూడగలిగేలా చేయనున్నారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు కొత్త కంపెనీల్లో పెట్టుబడి పెట్టే ముందు కీలక విషయాలను త్వరగా పరిశీలించుకునే వీలు కలుగుతుంది.
వివరాలు
"ఫిన్‌ఫ్లుయెన్సర్" మోసాలు అరికట్టడంలో ఏఐ సాయం
ఇక "ఫిన్‌ఫ్లుయెన్సర్" మోసాలను అరికట్టడంలో కూడా SEBI ఏఐ సాయంతో ముందుకు వెళ్తోంది. రిజిస్ట్రేషన్ లేకుండా పెట్టుబడి సలహాలు ఇస్తూ చిన్న పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించే వ్యక్తులను గుర్తించేందుకు ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు పాండే వెల్లడించారు. అనధికార ఖాతాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రలోభపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వివరాలు
కొత్త రిస్క్ ప్రమాణాలు గత డిసెంబర్‌లో అమలు
ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O) విభాగంలో కూడా SEBI దృష్టి సారించింది. ముఖ్యంగా తక్కువ కాల వ్యవధి ఉన్న వారాంత ఆప్షన్లలో అధిక లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త రిస్క్ ప్రమాణాలను గత డిసెంబర్‌లో అమలు చేశామని తెలిపారు. వాటి ప్రభావంపై ప్రస్తుతం డేటాను పరిశీలిస్తున్నామని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని పాండే స్పష్టం చేశారు. ఆధారాలపై ఆధారపడి, జాగ్రత్తగా ముందుకు వెళ్లే విధానాన్ని SEBI అనుసరిస్తోందని ఆయన తెలిపారు.