Year-ender 2025: ప్రైమరీ మార్కెట్‌లో కొత్త ఊపిరి: 2025లో ఐపీఓల హవా
ఈ వార్తాకథనం ఏంటి
2025లో ఐపీఓలు పెద్ద సంఖ్యలో వచ్చినా.. ఆరంభంలో మాత్రం ఆ ఊపు లేదనే చెప్పాలి. ముఖ్యంగా తొలి ఏడు నెలల కాలంలో ప్రైమరీ మార్కెట్‌లో పబ్లిక్ ఇష్యూల హడావుడి స్వల్పంగానే కొనసాగింది. మార్కెట్లలో ఒడిదుడుకులు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాల ప్రభావంతో అనేక కంపెనీలు ఐపీఓల నుంచి వెనక్కి తగ్గాయి. కొన్నిసంస్థలు తమ పబ్లిక్ ఇష్యూలను వాయిదా వేస్తూ వచ్చాయి. అయితే పరిస్థితులు మెరుగుపడిన తర్వాత, ముఖ్యంగా ఆగస్టు నెల నుంచి ఐపీఓల కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. ఆలస్యంగా మొదలైనప్పటికీ, గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ప్రైమరీ మార్కెట్‌లో ఎక్కువ ఉత్సాహం కనిపించింది.
గణాంకాలు
గతేడాది కంటే ఎక్కువే..
2024లో మొత్తం 90 కంపెనీలు మార్కెట్ ద్వారా నిధులు సమీకరించగా, వాటి ద్వారా రూ.1.60 లక్షల కోట్ల పెట్టుబడి సమకూరింది. 2025లో ఈ సంఖ్య మరింత పెరిగి 103 కంపెనీలకు చేరింది. ఇవన్నీ కలిపి రూ.1.76 లక్షల కోట్ల నిధులను సమీకరించాయి. 2023లో కేవలం 57 సంస్థలు మాత్రమే ఐపీఓల ద్వారా రూ.49,436 కోట్లను సమీకరించాయి. ప్రతి ఏడాది కంపెనీల సంఖ్యతో పాటు నిధుల పరిమాణం కూడా పెరుగుతున్నదానికి ఈ గణాంకాలే స్పష్టమైన ఉదాహరణ.
వివరాలు
బిగ్ ఐపీఓలు ఇవే..
ఈ ఏడాది పలు ప్రముఖ సంస్థలు ఐపీఓల ద్వారా భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించాయి. టాటా గ్రూప్‌కు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ టాటా క్యాపిటల్ రూ.15,512 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తరువాత హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (రూ.12,500 కోట్లు), ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా (రూ.11,607 కోట్లు), హెక్సావేర్ టెక్నాలజీస్ (రూ.8,750 కోట్లు), లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ (రూ.7,278 కోట్లు), బిలియన్ గ్యారేజ్ వెంచర్స్ - గ్రో (రూ.6,632 కోట్లు) ఉన్నాయి. మెయిన్‌బోర్డు విభాగంలో జిన్‌కుషాల్ ఇండస్ట్రీస్ కేవలం రూ.116.5 కోట్లతో అతి చిన్న ఐపీఓగా నమోదైంది.
స్టార్టప్
18 స్టార్టప్‌లు
ఈ ఏడాది మొత్తం 18 స్టార్టప్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రావడం ప్రత్యేకంగా చెప్పుకోదగిన విషయం. లెన్స్‌కార్ట్, గ్రో, మీషో, ఫిజిక్స్ వాలా వంటి సంస్థలు కలిపి దాదాపు రూ.41 వేల కోట్లను మార్కెట్ నుంచి సమీకరించాయి. గతేడాది స్టార్టప్‌లు సమీకరించిన మొత్తం నిధులు రూ.29 వేల కోట్లుగా ఉండటం గమనార్హం. ఆఫర్ ఫర్ సేల్‌దే హవా.. ఈ ఏడాది వచ్చిన ఐపీఓల్లో ఎక్కువ భాగం ఆఫర్ ఫర్ సేల్ రూపంలోనే సాగింది. ప్రారంభ దశలో కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన మదుపర్లు, ఐపీఓల సమయంలో తమ వాటాలను విక్రయించి లాభాలు పొందారు. మొత్తం సమీకరించిన నిధుల్లో సుమారు 60 శాతం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వాటాదారులకే చేరాయి.
సబ్‌స్క్రిప్షన్
భారీ సబ్‌స్క్రిప్షన్ సాధించిన ఐపీఓలు
కేవలం 23 సంస్థలు మాత్రమే పూర్తిగా తాజా షేర్ల జారీ ద్వారా నిధులు సమీకరించాయి. 15 కంపెనీలు పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానాన్నే అనుసరించగా, మిగిలిన సంస్థలు తాజా షేర్లు, ఆఫర్ ఫర్ సేల్ కలిపిన మార్గాన్ని ఎంచుకున్నాయి. హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐపీఓ ఈ ఏడాది అత్యధిక స్పందన పొందింది. ఇది సుమారు 300 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ కావడం విశేషం. అలాగే ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్, డెంటా వాటా, ఇన్‌ఫ్రా సొల్యూషన్స్, స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్, క్వాండ్రెంట్ ఫ్యూచర్ టెక్, స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ వంటి కంపెనీలు కూడా అత్యధిక సబ్‌స్క్రిప్షన్ సాధించిన జాబితాలో నిలిచాయి.
ఎస్‌ఎంఈ
ఎస్‌ఎంఈ విభాగంలోనూ అదే ఉత్సాహం
స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ విభాగంలో ఈ ఏడాది మొత్తం 252 కంపెనీలు ఐపీఓల ద్వారా మార్కెట్‌లోకి వచ్చాయి. వీటి ద్వారా రూ.11,400 కోట్ల నిధులు సమీకరించబడ్డాయి. 2023లో ఈ సంఖ్య 222 కంపెనీలుగా ఉండగా, అవి కలిపి రూ.9,580 కోట్లను సమీకరించాయి. లిస్టింగ్ ఫలితాలు మొత్తం 103 కంపెనీల్లో 70 కంపెనీలు లిస్టింగ్ సమయంలో లాభాలను అందించాయి. అయితే 32 సంస్థలు మాత్రం డిస్కౌంట్ ధర వద్ద లిస్టయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సుమారు 10 శాతం పెరగ్గా, బీఎస్‌ఈ సెన్సెక్స్ దాదాపు 9 శాతం రాబడిని మదుపర్లకు ఇచ్చింది.
అంచనాలు
వచ్చే ఏడాదిపై అంచనాలు
రాబోయే ఏడాదిలో కూడా ఐపీఓల హడావుడి కొనసాగనున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే 75 కంపెనీలు సెబీ నుంచి అనుమతులు పొందగా, మరో 100 సంస్థలు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. టెక్నాలజీ, ఫైనాన్షియల్, మౌలిక సదుపాయాలు, ఎనర్జీ, కన్జూమర్ రంగాలకు చెందిన కంపెనీలు ఇందులో ఉన్నాయి. జియో, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, ఓయో, ఫోన్‌పే వంటి ప్రముఖ సంస్థలు వచ్చే ఏడాది ఐపీఓకు వచ్చే అవకాశముంది.