LOADING...
Iran Crude Oil: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ముడి చమురు రాక
ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ముడి చమురు రాక

Iran Crude Oil: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ముడి చమురు రాక

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2026
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా తాజాగా ఇరాన్ ముడి చమురుపై విధించిన ఆంక్షలను సడలించడంతో,సముద్రంలో నిలిచిపోయిన చమురు మళ్లీ మార్కెట్‌లోకి వస్తోంది. దీంతో భారత్‌లోని శుద్ధి కర్మాగారాలు ఇరాన్ చమురు కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో,ఇరాన్ నుంచి చైనా వైపు బయల్దేరిన ఒక భారీ చమురు నౌక తన ప్రయాణ మార్గాన్ని మార్చుకొని భారత్ వైపు మళ్లుతున్నట్లు లండన్ ఆధారిత సముద్ర రవాణా గణాంకాలు తెలియజేశాయి. దీంతో ఏడేళ్ల అనంతరం తొలిసారి ఇరాన్‌ చమురు భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. జయ' అనే భారీ చమురు నౌక మొదట ఇరాన్ నుంచి ఆగ్నేయాసియా జలాల వైపు ప్రయాణం ప్రారంభించి, తన గమ్యస్థానంగా చైనాను సూచించింది.

vivarlu

గతంలో భారత్, ఇరాన్ చమురుకు ప్రధాన కొనుగోలుదారు

అయితే తాజాగా ఈ నౌక మార్గాన్ని మార్చుకొని భారత్ వైపు సాగుతోంది. ఈ చమురును భారత ప్రభుత్వానికి చెందిన శుద్ధి సంస్థ వినియోగించనున్నట్లు సమాచారం వెలువడుతోంది.కానీ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇదే సమయంలో 'జోర్డాన్' అనే మరో చమురు నౌక కూడా తన గమ్యస్థానంగా భారత్‌ను సూచించినట్లు అంతర్జాతీయ వార్తా వర్గాలు వెల్లడించాయి. గతంలో భారత్, ఇరాన్ చమురుకు ప్రధాన కొనుగోలుదారుగా నిలిచింది. 2018లో రోజుకు సుమారు ఐదు లక్షల పద్దెనిమిది వేల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోగా, 2019 మే నాటికి అది రెండు లక్షల అరవై ఎనిమిది వేల బ్యారెళ్లకు తగ్గింది.

vivaralu

2019 తర్వాత తొలిసారిగా భారత్‌కు ఇరాన్ చమురు

అనంతరం ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు కఠినంగా అమలులోకి రావడంతో ఆ దేశం నుంచి చమురు దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో భారత శుద్ధి సంస్థలు ఇతర దేశాల వైపు మళ్లాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, ఇరాన్ చమురుపై ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా ఎత్తివేయడంతో 2019 తర్వాత తొలిసారిగా భారత్‌కు ఇరాన్ చమురు రానుంది. ఇదే సమయంలో, ఇరాన్ నుంచి భారత్‌కు రావాల్సిన 'పింగ్ షున్' అనే చమురు నౌక తన మార్గాన్ని మార్చుకొని చైనా వైపు వెళ్లినట్లు ఇటీవల సముద్ర రవాణా గమనికలు వెల్లడించాయి.

Advertisement