LOADING...
Iran War Impact: ఇరాన్ యుద్ధం వల్ల భారత్‌లో ఖర్చులు పెరుగుతాయా? 
Iran War Impact: ఇరాన్ యుద్ధం వల్ల భారత్‌లో ఖర్చులు పెరుగుతాయా?

Iran War Impact: ఇరాన్ యుద్ధం వల్ల భారత్‌లో ఖర్చులు పెరుగుతాయా? 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2026
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఆరో రోజు కొనసాగుతున్న ఈ ఘర్షణ వల్ల పశ్చిమ ఆసియా ప్రాంతం తీవ్ర ఉద్రిక్తతలతో ఉంది. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఒక బాలిస్టిక్ క్షిపణిని తూర్పు మధ్యధరా సముద్రంలో నాటో రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేశాయి. మరోవైపు సౌదీ అరేబియాపై డ్రోన్ దాడిని కూడా అడ్డుకున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఇదే సమయంలో ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

వివరాలు 

దిగుమతుల ద్వారా 88శాతం క్రూడ్ ఆయిల్‌ తెచ్చుకుంటున్న భారత్

ఈయుద్ధం కొనసాగితే భారత్‌పై కూడా పరోక్షంగా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సాధారణ ప్రజలు ప్రతిరోజూ ఉపయోగించే అనేక వస్తువుల ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి. భారత్ తన అవసరాల్లో సుమారు 88శాతం క్రూడ్ ఆయిల్‌ను దిగుమతుల ద్వారా తెచ్చుకుంటోంది. హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ క్రూడ్ ఆయిల్‌లో ఐదోవంతు సరఫరా జరుగుతుంది. ఇరాన్ ఆ మార్గాన్ని అడ్డుకోవడం,అలాగే పశ్చిమ ఆసియాలోని ఆయిల్ రిఫైనరీలపై దాడులు జరగడం వల్ల గత వారం నుంచి చమురు ధరలు దాదాపు 20శాతం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 83డాలర్లకు చేరింది. దీని ప్రభావంగా భారత్‌లో పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ, ఇప్పటికిప్పుడు ధరలను పెంచే యోచన లేదని నివేదికలు చెబుతున్నాయి.

వివరాలు 

ఇంధనంతో పాటు వంట నూనెల ధరలు కూడా పెరిగే సూచనలు

అయితే హోర్ముజ్ మార్గం పూర్తిగా మూసుకుపోతే గుడ్ హోప్ కేప్ మార్గాన్ని భారత్ వినియోగించాల్సి రావచ్చు. దీంతో రవాణా సమయం, ఖర్చులు రెండూ పెరిగే అవకాశం ఉంది. ఇంధనంతో పాటు వంట నూనెల ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్‌కు అవసరమైన వంటనూనెలలో చాలా భాగం దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. పామ్ ఆయిల్‌ను ఇండోనేషియా,మలేసియా నుంచి,సోయాబీన్ ఆయిల్‌ను అర్జెంటీనా,బ్రెజిల్, అమెరికా నుంచి,సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను రష్యా, ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేస్తుంది. ఈ సరుకు రవాణాలో పెద్ద భాగం హోర్ముజ్ జలసంధి,సుయెజ్ కాలువ మార్గాల ద్వారా జరుగుతుంది. ఈ మార్గాల్లో అంతరాయం కలిగితే సరఫరా తగ్గి ధరలు పెరిగే ప్రమాదం ఉంది.

Advertisement

వివరాలు 

యుద్ధం కొనసాగితే రవాణా ఖర్చులు పెరిగి పప్పుల ధరలు కూడా పెరిగే అవకాశం

ఇప్పటికే దేశవ్యాప్తంగా సన్‌ఫ్లవర్, సోయాబీన్, పామ్ ఆయిల్ ధరలు కిలోకు 1 నుంచి 3 రూపాయల వరకు పెరిగినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో కూరగాయలు,పప్పుదినుసుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. భారత్ ప్రతి సంవత్సరం మయన్మార్,కెనడా,ఆఫ్రికా దేశాల నుంచి లక్షల టన్నుల పప్పుదినుసులు దిగుమతి చేస్తుంది. యుద్ధం కొనసాగితే రవాణా ఖర్చులు పెరిగి పప్పుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే బాదం,పిస్తా,కిస్మిస్, కుంకుమపువ్వు వంటి డ్రై ఫ్రూట్స్ దిగుమతులు కూడా ఇరాన్, ఆఫ్ఘానిస్తాన్ నుంచి వస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో యుద్ధ పరిస్థితులు ఉండటంతో సరఫరా నిలిచిపోతే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

అంతర్జాతీయ విమానయాన రంగంపైనా ఈ యుద్ధం ప్రభావం

వ్యవసాయ రంగంపైనా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.పశ్చిమ ఆసియా నుంచి ఎరువుల సరఫరాలో అంతరాయం కలగవచ్చు. మరోవైపు చమురు,గ్యాస్ ధరలు పెరగడం వల్ల వ్యవసాయ యంత్రాల వినియోగ ఖర్చు పెరిగి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమానయాన రంగంపైనా ఈ యుద్ధం ప్రభావం చూపుతోంది. పశ్చిమ ఆసియా గగనతలం ప్రమాదకరంగా మారడంతో అనేక విమాన సంస్థలు తమ మార్గాలను మార్చుతున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. దీంతో విమాన ప్రయాణం సమయం పెరగడం, ఇంధన ఖర్చు పెరగడం వల్ల టికెట్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యూరప్,పశ్చిమ ఆసియా దేశాలకు వెళ్లే ప్రయాణ ఖర్చులు పెరగవచ్చు.

వివరాలు 

రెండు రోజుల్లోనే 12శాతం వరకు పెరిగిన ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ ధరలు

ఇక ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశముంది. క్రూడ్ ఆయిల్‌తో తయారయ్యే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ ధరలు ఇప్పటికే రెండు రోజుల్లోనే 12శాతం వరకు పెరిగాయి. దీంతో వివిధ పరిశ్రమల్లో ప్లాస్టిక్ ఆధారిత వస్తువుల ధరలు పెరగవచ్చు. ఔషధ రంగంపైనా ఈ ప్రభావం ఉండే అవకాశముంది. మందుల తయారీలో ఉపయోగించే అనేక రసాయన పదార్థాలు, ముడి సరుకులు విదేశాల నుంచి దిగుమతి అవుతాయి.

వివరాలు 

సాధారణ ప్రజల ఖర్చులు మరింత పెరిగే అవకాశం

సరఫరా వ్యవస్థల్లో అంతరాయం ఏర్పడితే ఔషధ తయారీ ఖర్చులు పెరిగి మందుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం చూస్తే ఇరాన్ యుద్ధం కొనసాగితే భారత్‌లో ఇంధనం నుంచి వంటనూనెల వరకు, పప్పులు నుంచి విమాన ప్రయాణం వరకు అనేక రంగాల్లో ధరలు పెరిగే పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సాధారణ ప్రజల ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement