Foreign Investors: రూపాయి పతనం,చమురు ధరల పెరుగుదల.. కేంద్రం కొత్త వ్యూహం ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి,రూపాయి విలువ పతనం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) భారత ప్రభుత్వ బాండ్లలో చేసే పెట్టుబడులపై మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) తొలగించే ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లు సమాచారం. అలాగే ప్రభుత్వ బాండ్లపై విదేశీ పెట్టుబడిదారులు పొందే వడ్డీ ఆదాయంపై ప్రస్తుతం విధిస్తున్న 20 శాతం విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేయడం లేదా గణనీయంగా తగ్గించే అవకాశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన వార్తను తొలిసారిగా 'ఎకనామిక్ టైమ్స్' వెల్లడించింది.
వివరాలు
80శాతానికి పైగా ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న భారత్
ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. భారత్ తన అవసరాల్లో 80శాతానికి పైగా ముడిచమురును దిగుమతి చేసుకుంటుంది. దీంతో చమురు ధరలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. గతంలో బ్యారెల్‌కు 70డాలర్ల వద్ద ఉన్న బ్రెంట్ క్రూడ్ ధరలు ఇప్పుడు 95 నుంచి 105 డాలర్ల మధ్యకు చేరుకున్నాయి. దీనివల్ల దిగుమతి వ్యయం పెరిగి డాలర్ల డిమాండ్ అధికమవుతోంది. ఫలితంగా రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూపాయి విలువ 5 నుంచి 6 శాతానికి పైగా పడిపోయింది. మే 20న అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 96.965వద్దకు చేరి రికార్డు కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది.
వివరాలు
మార్చి నెలలోనే రూ.1.17 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పెట్టుబడిదారులు
రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతుల వ్యయం పెరగడమే కాకుండా విదేశీ పెట్టుబడిదారుల రాబడులు కూడా తగ్గుతున్నాయి. దీంతో విదేశీ పెట్టుబడులు మరింత తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే 2026లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి సుమారు రూ.2.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత ఏడాది మొత్తం ఉపసంహరించుకున్న మొత్తంతో పోలిస్తే ఇది రెండింతలకుపైగా కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి నెలలోనే రూ.1.17 లక్షల కోట్ల విలువైన షేర్లను విదేశీ పెట్టుబడిదారులు విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
వివరాలు
ప్రభుత్వ బాండ్లపై ఆసక్తి చూపుతున్న విదేశీ పెట్టుబడిదారులు
అయితే షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు తగ్గించిన విదేశీ పెట్టుబడిదారులు ప్రభుత్వ బాండ్లపై మాత్రం ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది భారత ప్రభుత్వ రుణ పత్రాల్లో సుమారు 1.4 బిలియన్ డాలర్ల నికర పెట్టుబడులు వచ్చాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ప్రభుత్వ బాండ్లను సురక్షిత పెట్టుబడులుగా భావించడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారులకు పన్ను రాయితీలు కల్పించడం ద్వారా మరిన్ని దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించాలని కేంద్రం భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెన్షన్ ఫండ్లు, బీమా సంస్థలు, పెద్ద పెట్టుబడి సంస్థలు భారత ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టేలా చేయడమే ఈ చర్యల లక్ష్యంగా తెలుస్తోంది.
వివరాలు
రాష్ట్రపతి ఆమోదం లభించాకే.. నిర్ణయాలు అమల్లోకి..
విదేశీ పెట్టుబడులు పెరిగితే విదేశీ మారక నిల్వలు బలోపేతం కావడంతో పాటు రూపాయి స్థిరత్వానికి కూడా మద్దతు లభిస్తుంది. అలాగే ప్రభుత్వ రుణ అవసరాలను సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత ఈ నిర్ణయాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.