LOADING...
Fact Check: రూ.22 వేలతో రూ.5.5 లక్షల లాభం నిజమేనా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
రూ.22 వేలతో రూ.5.5 లక్షల లాభం నిజమేనా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

Fact Check: రూ.22 వేలతో రూ.5.5 లక్షల లాభం నిజమేనా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2026
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న ఒక వీడియోపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వీడియోలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరును ఉపయోగిస్తూ.. కేవలం రూ.22,000 పెట్టుబడితో వారం రోజుల్లోనే రూ.5.5 లక్షల వరకు లాభాలు పొందవచ్చని తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోను PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పూర్తిగా నకిలీదిగా ప్రకటించింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్ వీడియో అని స్పష్టం చేసింది. వీడియోలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ కంపెనీల లోగోలు చూపిస్తూ, దీనిని ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న పెట్టుబడి వేదికగా చిత్రీకరించారు.

వివరాలు

లాభాల పేరుతో మోసగించే ప్రయత్నం

అలాగే ఆకర్షణీయమైన గ్రాఫిక్స్, వేగంగా పెరుగుతున్న లాభాల కౌంటర్లు చూపిస్తూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. అయితే ఆర్థిక మంత్రి గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఇలాంటి పెట్టుబడి పథకాలను ఎప్పుడూ ఆమోదించలేదని PIB స్పష్టం చేసింది. తక్కువ సమయంలో అసాధారణ లాభాలు వస్తాయని చెప్పే ఏ పథకమూ నమ్మదగినది కాదని హెచ్చరించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి హామీలు సాధారణంగా పాంజీ స్కీమ్‌ల లక్షణాలు కలిగి ఉంటాయి. మొదట చిన్న లాభాలు చూపించి నమ్మకం కలిగించిన తర్వాత, పెద్ద మొత్తాల్లో మోసం చేసే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

వివరాలు

అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకూడదు

ఇటీవల కాలంలో ఏఐ డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ప్రముఖుల ముఖాలు, స్వరాలను నకిలీగా వాడుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్లు లేదా ప్రభుత్వ ప్రకటనల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని అధికారులు సూచించారు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత లేదా బ్యాంక్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. ఇలాంటి అనుమానాస్పద వీడియోలు లేదా సందేశాలు కనిపిస్తే వెంటనే PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌కు పంపి నివేదించాలని కేంద్ర ప్రభుత్వం పౌరులకు సూచించింది.

Advertisement