Stock market: ఐటీ, హెల్త్‌కేర్ షేర్ల జోష్.. వరుసగా మూడో రోజు లాభాల్లో మార్కెట్
ఈ వార్తాకథనం ఏంటి
ఐటీ, హెల్త్‌కేర్ రంగాల్లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ,ఐటీ,రియాల్టీ,ఫార్మా,హెల్త్‌కేర్ రంగాల షేర్లలో నమోదైన కొనుగోళ్లు సూచీలకు బలాన్నిచ్చాయి. దీంతో దేశీయ సూచీలు వరుసగా మూడో ట్రేడింగ్ రోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ శుక్రవారం ఉదయం గత ముగింపు స్థాయి 77,502.12తో పోలిస్తే పెరుగుదలతో 78,152.34 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రారంభ సెషన్‌లో దాదాపు 600పాయింట్ల వరకు లాభాల్లో కదిలిన సూచీ,మధ్యాహ్నం తర్వాత కొంత లాభాలను కోల్పోయినా చివరకు 261.79 పాయింట్లు పెరిగి 77,763.91 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 95.15 పాయింట్లు లాభపడి 24,270.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.22గా నమోదైంది.
వివరాలు
క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 71 డాలర్లు
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా లాభాలను నమోదు చేశాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 71 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు ధర 4,179 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.