
Growth of IT: ఐటీ రంగ వృద్ధి శాతం పడిపోయింది.. 2025-26లో కేవలం 6-8శాతమే
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ఐటీ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025-26) 6-8 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశముందని రేటింగ్ సేవల సంస్థ క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది.
ఇది వరుసగా మూడో ఏడాది ఐటీ రంగం 10 శాతానికి లోపు వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో యూఎస్, ఐరోపా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు సవాళ్లను ఎదుర్కొనడం వల్ల దేశీయ ఐటీ రంగం వృద్ధిపై ప్రభావం పడుతోందని క్రిసిల్ పేర్కొంది.
Details
85% ఆదాయం యూఎస్, ఐరోపా మార్కెట్ నుంచే
దేశీయ ఐటీ కంపెనీల ఆదాయాల్లో యూఎస్, ఐరోపా క్లయింట్ల వాటా 85 శాతం ఉండటం గమనార్హం.
ఈ దేశాల్లో ఆర్థిక మాంద్యం కొనసాగడం వల్ల ఐటీ ఆదాయాలు తగ్గే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే రూపాయి మారకం విలువ క్షీణించడం మాత్రం ఐటీ కంపెనీలకు కొంత కలిసొచ్చే అంశంగా మారనుంది.
Details
ఆదాయం తగ్గే రంగాలు
క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రకారం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) విభాగం నుంచి ఐటీ కంపెనీలకు 30 శాతం ఆదాయం వస్తోంది.
రిటైల్ రంగం నుంచి 15 శాతం ఆదాయం లభిస్తోంది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగాల నుంచి ఆదాయం తగ్గే అవకాశముందని క్రిసిల్ అంచనా వేసింది.
ఉత్పత్తి, వైద్య రంగాల నుంచి కూడా ఆదాయ క్షీణత కొనసాగుతుందని నివేదిక పేర్కొంది.
లాభదాయకత మాత్రం బలంగా ఉంటుంది
ఐటీ కంపెనీలు లాభాలను మాత్రం కొనసాగిస్తాయని క్రిసిల్ రేటింగ్స్ విశ్లేషించింది.
ఏఐ, జెనరేటివ్ ఏఐ టెక్నాలజీకి పెరుగుతున్న డిమాండ్ వల్ల కొత్త ప్రాజెక్టులు లభించి ఐటీ కంపెనీలు లాభాలను పెంచుకునే అవకాశముందని అంచనా వేసింది.
Details
ఐటీ కంపెనీల కొనుగోళ్లతో విస్తరణ
పెద్ద ఐటీ కంపెనీలు చిన్న, మధ్య తరహా ఐటీ సంస్థలను కొనుగోలు చేసి తమ సేవలను విస్తరించేందుకు, వినియోగదార్ల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు.
జీసీసీల వల్ల సవాళ్లు
బహుళ జాతి సంస్థలు దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను (GCC) భారీగా ఏర్పాటు చేయడం, దేశీయ ఐటీ కంపెనీలకు ప్రతిబంధకంగా మారుతోందని క్రిసిల్ పేర్కొంది.
మరోవైపు, ఐరోపా దేశాల్లో అంచనాలకు మించి ఆర్థికాభివృద్ధి మందగించడం కూడా దేశీయ ఐటీ రంగానికి సవాలుగా మారుతుందని విశ్లేషించింది.
Details
24 అగ్రగామి కంపెనీలపై అధ్యయనం
క్రిసిల్ రేటింగ్స్ దేశంలోని 24 అగ్రగామి ఐటీ కంపెనీల ప్రతినిధులను సంప్రదించి ఈ అంచనాలను రూపొందించింది.
మొత్తం మీద, 2025-26లో ఐటీ రంగం పరిమిత వృద్ధి సాధించినా, లాభదాయకత బలంగా ఉండే అవకాశముందని నివేదిక వెల్లడించింది.