Jack Ma: కొత్త కంపెనీని ప్రారంభించిన చైనా కుబేరుడు జాక్ మా.. పేరేంటో తెలుసా?
చైనా కుబేరుడు, అలీబాబా గ్రూప్ (Alibaba Group) సహ వ్యవస్థాపకుడు జాక్ మా (Jack Ma) కొత్త కంపెనీని ప్రారంభించారు. జాక్ మా ప్యాక్డ్ ఆహారాన్ని విక్రయించే కొత్త పరిశ్రమను ప్రారంభించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. తద్వారా జాక్ మా ఫుడ్ అండ్ డ్రింక్స్ పరిశ్రమలోకి ప్రవేశించారు. తన రిటైర్‌మెంట్ తర్వాత వ్యవసాయ రంగంపై దృష్టి సారించి.. దాన్ని రంగాల్లోకి విస్తరించాలని ఆయన భవిష్యత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోందని మార్నింగ్ పోస్ట్ నివేదిక పేర్కొంది. జాక్ మా తన 55వ పుట్టినరోజున 2019లో అలీబాబా ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. కొత్త కంపెనీ పేరును 'హాంగ్‌జౌ మా కిచెన్ ఫుడ్' పేరుతో జాక్ మా రిజిస్టర్ చేయించుకున్నారు.
రాబోయే మూడేళ్లలో గణనీయంగా చైనా ఫుడ్ పరిశ్రమ వృద్ధి
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. కంపెనీ ముందుగా ప్యాక్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించాలని భావిస్తోంది. ప్యాక్‌డ్ ఫుడ్‌కు పెరుగుతున్న డిమాండ్, మహమ్మారి తర్వాత జీవనశైలిలో మార్పుల నేపథ్యంలో అవసరాలను దృష్టిలో ఉంచుకొని జాక్ మా ఈ మేరకు కొత్త కంపెనీని ప్రారంభించారు. చైనాలో దేశీయ ఫుడ్ పరిశ్రమ రాబోయే మూడేళ్లలో గణనీయమైన వృద్ధిని చూస్తోందని అక్కడి మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. 'హాంగ్‌జౌ మా కిచెన్ ఫుడ్' కంపెనీని 1.4మిలియన్ డాలర్ల మూలధనంతో జాక్ మా రిజిస్టర్ చేయించారు. జాక్ మా కొన్నేళ్లుగా అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. చైనా బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఆయన గతంలో ఎత్తిచూపారు. దీంతో చైనా ప్రభుత్వం ఆయన సంస్థలపై ఆంక్షలు విధించింది.