
Jan Aushadhi: జన్ ఔషధి వల్ల రూ.38,000 కోట్లు ఆదా.. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా భారీ లాభం!
ఈ వార్తాకథనం ఏంటి
గత 11 ఏళ్లలో జన్ ఔషధి దుకాణాల ద్వారా పౌరులు సుమారు రూ. 38,000 కోట్లను ఆదా చేశారని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. జూన్ 30, 2025 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 16,912 జన ఔషధి కేంద్రాలు (JAKలు) ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా బ్రాండెడ్ ఔషధాల ధరలతో పోల్చితే ప్రజలకు రూ. 38,000 కోట్ల మేర ఆదా జరిగినట్లు అంచనా వేశామని పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య ఖాతాల అంచనాల ప్రకారం 2014-15లో కుటుంబాల ఆరోగ్య వ్యయంలో 62.6 శాతం జేబు ఖర్చు ఉంది.
Details
2027 మార్చి నాటికి దేశంలో మొత్తం 25,000 కేంద్రాలు ఏర్పాటు
2021-22 నాటికి అది 39.4 శాతానికి తగ్గిందని, దీనిలో ఈ పథకం ముఖ్య భూమిక పోషించిందని మంత్రి చెప్పారు. జన్ ఔషధి పథకాన్ని మరింత విస్తరించి, ప్రజల జేబులోంచి జరిగే వ్యయాన్ని మరింత తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి నాటికి దేశంలో మొత్తం 25,000 కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో 2,110 ఔషధాలు, 315 సర్జికల్ పరికరాలు, ఇతర వైద్య వినియోగ వస్తువులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి అన్ని ముఖ్య చికిత్సా విభాగాలను కవర్ చేస్తాయని చెప్పారు.
Details
61 రకాల శస్త్రచికిత్సా పరికరాలు
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బ్రాండెడ్ ఉత్పత్తులతో పోల్చితే, ఈ కేంద్రాల్లో లభించే ఔషధాలు 50% నుంచి 80% వరకు తక్కువ ధరకు లభ్యమవుతాయని వివరించారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 61 రకాల శస్త్రచికిత్సా పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. అలాగే, 2023-24 సంవత్సరంలో రూ. 1,470 కోట్ల విలువైన (MRP ప్రకారం) మందులు, 2024-25 సంవత్సరంలో రూ. 2,022.47 కోట్ల విలువైన మందులు విక్రయించాయని వివరించారు.