Japan: జపాన్‌లో వడ్డీ రేటు పెంపు.. 31 ఏళ్ల గరిష్ఠానికి చేరిన కీలక రేటు
ఈ వార్తాకథనం ఏంటి
పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావడంతో పాటు,దశాబ్దాలుగా కొనసాగుతున్న అతి తక్కువ వడ్డీ రేట్ల విధానం నుంచి క్రమంగా బయటపడే చర్యల్లో భాగంగా జపాన్ కేంద్ర బ్యాంకు కీలక వడ్డీ రేటును 31 ఏళ్ల గరిష్ఠానికి పెంచింది. శుక్రవారం మార్కెట్లు ఊహించినట్లుగానే బ్యాంక్ ఆఫ్ జపాన్(BOJ)వడ్డీ రేటును 1 శాతం నుంచి 1.25 శాతానికి పెంచింది. 1995తర్వాత ఈ స్థాయికి వడ్డీ రేటు చేరడం ఇదే తొలిసారి. ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడం,దాని ప్రభావంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అధికం కావడంతో ప్రపంచంలోని పలు ప్రధాన కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ మూడేళ్లకు పైగా కాలం తర్వాత తొలిసారిగా తన కీలక వడ్డీ రేటును పెంచింది.
వివరాలు
వడ్డీ రేట్ల పెంపుతో యెన్‌కు బలం
ఈ నెల ప్రారంభంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా రుణ వ్యయాలను పెంచింది.
జపాన్ కేంద్ర బ్యాంకు 2024లో వడ్డీ రేటును మైనస్ 0.1 శాతం నుంచి పెంచడం ప్రారంభించింది.
అప్పటి నుంచి గత రెండున్నరేళ్లలో ఆరు సార్లు రేట్లను పెంచింది.
ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఉన్న స్థాయికి వడ్డీ రేటును తీసుకెళ్లే లక్ష్యంతో BOJ క్రమంగా ఈ చర్యలు చేపడుతోంది.
కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడాన్ని ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం అంటారు.
సాధారణంగా దీనివల్ల దేశ కరెన్సీపై ఆకర్షణ పెరిగి, వ్యాపారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది.
వివరాలు
ద్రవ్యోల్బణం, బలహీన యెన్‌తో సవాళ్లు
''ప్రపంచంలో మిగిలిన అతి చౌక రుణ వనరుల్లో ఒకటి కనుమరుగవుతోంది''అని పెట్టుబడి సంస్థ ఈటోరో మార్కెట్ విశ్లేషకురాలు లాలే అకోనర్ పేర్కొన్నారు.
బలహీనంగా ఉన్న యెన్,పెరుగుతున్న ధరలు,తగ్గిపోతున్న కార్మిక శక్తి వంటి పలు ఆర్థిక సవాళ్లను జపాన్ ఎదుర్కొంటోంది.
BOJ ప్రకటనకు ముందు శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం.. ఆగస్టులో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే జపాన్‌లో ద్రవ్యోల్బణం అధికంగా లేకపోయినా,అక్కడ ధరలు పెరగడం ఇటీవలి కాలంలోనే గణనీయంగా కనిపిస్తోంది.
దాదాపు మూడు దశాబ్దాల పాటు జపాన్ చాలా తక్కువ ద్రవ్యోల్బణం లేదా ధరలు తగ్గే పరిస్థితి (డిఫ్లేషన్)ను ఎదుర్కొంది.
ఆగస్టులో ప్రధాన ద్రవ్యోల్బణం (కోర్ ఇన్ఫ్లేషన్) 1.8 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గింది.
వివరాలు
బలహీన యెన్.. ఇంధన ధరల భారం
అయినప్పటికీ, ఇది కేంద్ర బ్యాంకు నిర్దేశించిన 2 శాతం లక్ష్యానికి సమీపంలోనే ఉంది.
ఇరాన్ యుద్ధం కారణంగా కీలకమైన హర్ముజ్ జలసంధి మీదుగా చమురు, గ్యాస్ రవాణాకు అంతరాయాలు ఏర్పడటంతో ఈ ఏడాది ప్రపంచ ఇంధన ధరలు పెరిగాయి.
మధ్యప్రాచ్యం నుంచి ఇంధన దిగుమతులపై జపాన్ ఎక్కువగా ఆధారపడుతున్నందున, సరఫరా అంతరాయాల ప్రభావానికి ఆ దేశం మరింతగా గురయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, జపాన్ కరెన్సీ యెన్‌పై కూడా ఇటీవలి నెలల్లో ఒత్తిడి పెరిగింది.
ఆగస్టులో యెన్ విలువ 40 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిన తర్వాత, దాని పతనాన్ని అడ్డుకునేందుకు జపాన్, అమెరికా సంయుక్తంగా మార్కెట్‌లో జోక్యం చేసుకున్నట్లు ఇరు దేశాలు ధ్రువీకరించాయి.
వివరాలు
జపాన్, అమెరికా చర్యలు
తూర్పు జపాన్‌ను భారీ భూకంపం, సునామీ కుదిపేసిన 2011 తర్వాత ఇరు దేశాలు కలిసి చేపట్టిన తొలి జోక్యం ఇదే.
భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని సంయుక్త చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని జపాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ, అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ అప్పట్లో తెలిపారు.
యెన్‌కు మద్దతు ఇవ్వడానికి వడ్డీ రేట్లను పెంచాలని బెసెంట్ BOJపై ఒత్తిడి పెంచుతున్నారు.
ఆ బ్యాంకు గవర్నర్ కజువో ఉఎడా ''సరైన నిర్ణయం తీసుకోవాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
''వడ్డీ రేట్లు పెంచినప్పటికీ యెన్ బలహీనంగానే ఉంటే.. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగి, మార్కెట్లు లేదా జపాన్ ప్రభుత్వం కోరుకునే దానికంటే వేగంగా వడ్డీ రేట్లను కఠినతరం చేయాల్సిన పరిస్థితి BOJకి రావచ్చు'' అని అకోనర్ విశ్లేషించారు.