Japan: జపాన్ వెళ్లాలంటే భారీ ఖర్చు.. జూలై 1 నుంచి వీసా ఫీజులు ఐదు రెట్లు పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌కు వెళ్లాలనుకునే విదేశీ ప్రయాణికులకు ఇకపై మరింత ఖర్చు కానుంది. దాదాపు 48 ఏళ్ల తర్వాత తొలిసారిగా వీసా రుసుములను గణనీయంగా పెంచాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ఫీజులు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.ఈ మార్పులతో సింగిల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎంట్రీ వీసాల ఖర్చు ప్రస్తుతం ఉన్న దానికంటే ఐదు రెట్లు పెరగనుంది. ప్రస్తుతం సింగిల్ ఎంట్రీ వీసాకు 3,000 యెన్‌లు వసూలు చేస్తుండగా,జూలై నుంచి అది 15,000 యెన్‌లకు చేరనుంది. అదే విధంగా మల్టిపుల్ ఎంట్రీ వీసా ఫీజు 6,000 యెన్‌ల నుంచి 30,000 యెన్‌లకు పెరగనుంది.
వివరాలు
పర్యాటకుల రాకపై ప్రతికూల ప్రభావం ఉండదు
భారత కరెన్సీలో లెక్కిస్తే సింగిల్ ఎంట్రీ వీసా ఖర్చు సుమారు రూ.1,750 నుంచి రూ.8,750కు, మల్టిపుల్ ఎంట్రీ వీసా రూ.3,500 నుంచి రూ.17,500 వరకు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై జపాన్ విదేశాంగ మంత్రి తొషిమిత్సు మొతెగి స్పందిస్తూ.. 1978లో నిర్ణయించిన వీసా రుసుములు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా లేవని తెలిపారు. ద్రవ్యోల్బణం, కరెన్సీ మారకపు విలువల్లో వచ్చిన మార్పులు, పరిపాలనా వ్యయాల పెరుగుదల, యెన్ విలువ క్షీణించడం, విదేశీ సందర్శకుల సంఖ్య భారీగా పెరగడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఫీజులను సవరించినట్లు చెప్పారు. అయితే ఈ పెంపు వల్ల పర్యాటకుల రాకపై వెంటనే ప్రతికూల ప్రభావం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.
వివరాలు
రికార్డు స్థాయికి అంతర్జాతీయ సందర్శకులు
కోవిడ్ అనంతరం జపాన్ పర్యాటక రంగం వేగంగా కోలుకుంది. యెన్ బలహీనపడటంతో విదేశీ పర్యాటకులకు జపాన్‌లో పర్యటనలు తక్కువ ఖర్చుతో సాధ్యమవుతున్నాయి. దీంతో అంతర్జాతీయ సందర్శకుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇతర జీ-7 దేశాల్లో అమల్లో ఉన్న రుసుములకు అనుగుణంగా వీసా ఫీజులను పెంచాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక విదేశీయుల నివాస అనుమతులకు సంబంధించిన దరఖాస్తులపైనా అధిక రుసుములు విధించేందుకు ప్రభుత్వం చట్టసవరణలు చేపట్టింది. శాశ్వత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసే వారి గరిష్ట ఫీజును 10,000 యెన్‌ల నుంచి 300,000 యెన్‌ల వరకు పెంచే అవకాశం ఉంది.
వివరాలు
భారతీయులపై ఈ కొత్త వీసా రుసుములు
అలాగే నివాస హోదా మార్పు, గడువు పొడిగింపు వంటి సేవలపై గరిష్ట రుసుమును 100,000 యెన్‌ల వరకు పెంచేందుకు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అయితే భారతీయులపై ఈ కొత్త వీసా రుసుములు పూర్తిస్థాయిలో అమలవుతాయా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం భారతదేశంలో జపాన్ వీసాలకు ప్రత్యేక ఫీజు విధానం అమల్లో ఉండటంతో, ఈ అంశంపై జపాన్ రాయబార కార్యాలయం లేదా వీసా సేవా సంస్థల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.