
Tim Cook: టిమ్ కుక్ నిష్క్రమణ పుకార్లు: జాన్ టెర్నస్ కొత్త ఆపిల్ CEO గా బాధ్యతలు స్వీకరించబోతున్నారా?
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వచ్చే ఏడాదికి 65 ఏళ్ల వయసు పూర్తి చేసుకోనున్నారు. 2011లో ఆపిల్ కంపెనీ అధినేతగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, ఇకపై ఆ పదవిని వీడే సమయం దగ్గరపడిందా? అనే చర్చలు ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఊపందుకున్నాయి. టిమ్ కుక్ తరువాత ఆ కీలక పదవిని ఎవరు చేపడతారనే ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
ఆయన స్థానంలో వచ్చే వ్యక్తి ఆపిల్ భవిష్యత్తు నిర్ణయాలను తీసుకునే కీలక బాధ్యత వహించాలి
గత కొన్నేళ్లలో ఆపిల్‌లోని పలువురు ఉన్నతాధికారులు కంపెనీని వీడారు. ఆ జాబితాలో డిజైన్ చీఫ్ జోనీ ఐవ్, రిటైల్ హెడ్ ఏంజెలా అహ్రెండ్ట్స్, సీఎఫ్ఓ లూకా మాస్ట్రీ, సీఓఓ జెఫ్ విలియమ్స్ వంటి ప్రముఖులు ఉన్నారు. అయితే వారి వైదొలుగుదల అంతగా చర్చనీయాంశం కాలేదు. కానీ టిమ్ కుక్ పదవీ విరమణ మాత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన స్థానంలో వచ్చే వ్యక్తి ఆపిల్ భవిష్యత్తు నిర్ణయాలను తీసుకునే కీలక బాధ్యత వహించాలి. ఆ స్థానానికి అర్హుడిగా ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. జాన్ టర్నస్.
వివరాలు
24 ఏళ్లుగా ఆపిల్‌తో అనుబంధం
జాన్ టర్నస్ ప్రస్తుతం ఆపిల్ కంపెనీలో హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. దాదాపు 24 ఏళ్లుగా ఆపిల్‌తో అనుబంధంగా ఉన్న ఆయన సంస్థలో పలు కీలక పదవులను నిర్వర్తించారు. ఆయన వ్యూహాలు, నిర్ణయాలు కేవలం హార్డ్‌వేర్ పరిమితిలోనే కాకుండా కంపెనీ మొత్తం కార్యకలాపాలపై ప్రభావం చూపే విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఆయన వయసు 50 సంవత్సరాలు. గమనించదగిన విషయం ఏమిటంటే.. టిమ్ కుక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఆయన వయసు 50 ఏళ్లు.
వివరాలు
సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగే అంశంపై స్పదించని టీమ్ కుక్
టిమ్ కుక్‌కి జాన్ టర్నస్‌పై మంచి నమ్మకం ఉందని ఆపిల్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈయన ఆపిల్ మొట్టమొదటి కొత్త ఐఫోన్ ఫారమ్ ఫ్యాక్టర్ అయిన ఐఫోన్ ఎయిర్‌ను పరిచయం చేశారు. అదనంగా, ఐఫోన్ 17 విడుదల సందర్భంగా లండన్‌లోని యాపిల్ రీజెంట్ స్ట్రీట్ స్టోర్‌లో వినియోగదారులను స్వయంగా పలకరించారు. ఇలాంటి కారణాల వల్ల కుక్ స్వయంగా అతన్ని ఎక్కువగా విశ్వసిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతాయి. అయితే సీఈఓ పదవి నుంచి తప్పుకునే అంశంపై టిమ్ కుక్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వ్యాఖ్య చేయలేదు.