LOADING...
Petrol, Diesel: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతి సుంకాల్లో భారీ కోత
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతి సుంకాల్లో భారీ కోత

Petrol, Diesel: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతి సుంకాల్లో భారీ కోత

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2026
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పెరగడం వాహనదారులను ఆందోళనకు గురిచేసింది. కేవలం వారంలోనే నాలుగు సార్లు ధరలు పెరగడంతో ఇంధన వ్యయం మరింత భారంగా మారింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్న భయం వినియోగదారుల్లో నెలకొంది. అయితే అమెరికా-ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించేందుకు తాత్కాలిక ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధర బ్యారెల్‌కు సుమారు 93 డాలర్లకు పడిపోగా, వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ (WTI) ధర సుమారు 88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో చమురు మార్కెట్‌కు కొంత ఊరట లభించింది.

వివరాలు

ప్రత్యక్ష ప్రభావం చూపకపోవచ్చు

ఇదే సమయంలో పెట్రోల్‌, డీజిల్‌, ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ATF) ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 30న విడుదల చేసిన ప్రకటనలో జూన్‌ 1 నుంచి ఈ ఇంధనాలపై ఎగుమతి సుంకాలను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. పెట్రోల్‌ ఎగుమతిపై లీటరుకు రూ.1.50, డీజిల్‌ ఎగుమతిపై లీటరుకు రూ.13.50 తగ్గించగా, ఏటీఎఫ్‌ ఎగుమతిపై లీటరుకు రూ.9.50 మేర పన్నును తగ్గించింది. అయితే ఈ నిర్ణయం దేశీయ వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపదని స్పష్టమైంది. ఎందుకంటే దేశీయ మార్కెట్‌లో అమలయ్యే పన్నుల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలోనే ఎగుమతి సుంకాల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement