EPFO rules: PF ట్రస్టుల పెట్టుబడి నిబంధనల్లో మార్పులు.. ఈక్విటీల్లో 15 శాతం వరకు అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల భవిష్య నిధి (PF) సొమ్ము పెట్టుబడులకు సంబంధించి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది. మినహాయింపు పొందిన సంస్థల పరిధిలోని PF ట్రస్టులు తమ దగ్గర ఉన్న నిధుల్లో 5 శాతం నుంచి 15 శాతం వరకు ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించింది. ప్రభుత్వ సెక్యూరిటీలు,డెట్ సాధనాలు,ఇతర పెట్టుబడులకు కూడా కొత్త పరిమితులను నిర్ణయించింది. ఉద్యోగుల నుంచి సేకరించే నెలవారీ PF చందాలను ఎప్పటిలోగా బదిలీ చేయాలి? వాటిని ఎన్ని రోజుల్లో పెట్టుబడి పెట్టాలి? అనే అంశాలపై కూడా స్పష్టమైన గడువులను ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 20న కేంద్ర కార్మిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు
మినహాయింపు పొందిన PF సంస్థలు, ట్రస్టులు అంటే ఏమిటి?
2015 మే 29న జారీ చేసిన పాత నోటిఫికేషన్ స్థానంలో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
అయితే పాత నోటిఫికేషన్ అమల్లో ఉన్న సమయంలో ఇప్పటికే జరిగిన లేదా జరగకుండా మిగిలిపోయిన విషయాలకు మాత్రం ఈ మార్పులు వర్తించవని స్పష్టం చేసింది.
సాధారణంగా ఉద్యోగుల భవిష్య నిధి పథకం (EPF) కింద ఉద్యోగుల జీతాల నుంచి కొంత మొత్తాన్ని PFగా జమ చేస్తారు.
అయితే కొన్ని కంపెనీలు, సంస్థలకు EPF పథకం నిబంధనల నుంచి మినహాయింపు లభిస్తుంది.
ఇలాంటి సంస్థలు తమ ఉద్యోగుల PF సొమ్మును సొంత ట్రస్టుల ద్వారా నిర్వహించుకోవచ్చు. వీటినే మినహాయింపు పొందిన PF సంస్థలు (Exempted Establishments) అంటారు.
వివరాలు
మినహాయింపు పొందిన PF సంస్థలు, ట్రస్టులు అంటే ఏమిటి?
అయితే ఈ సంస్థలు తమ ఉద్యోగులకు సాధారణ EPF పథకంలో లభించే ప్రయోజనాలతో సమానంగా లేదా అంతకంటే మెరుగైన ప్రయోజనాలు కల్పించాలి.
ఉద్యోగుల నుంచి వసూలు చేసే PF చందాలు, వాటిపై వచ్చే వడ్డీ, పెట్టుబడులు, డబ్బు ఉపసంహరణ వంటి వ్యవహారాలను ఆయా ట్రస్టులే నిర్వహిస్తాయి.
2020 సామాజిక భద్రతా కోడ్‌లోని సెక్షన్ 143 కింద మినహాయింపు పొందిన సంస్థలు, అలాగే 2026 ఉద్యోగుల భవిష్య నిధి పథకంలోని పేరా 12 ప్రకారం మినహాయింపు పొందిన ఉద్యోగులు లేదా ఉద్యోగుల వర్గాలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
వివరాలు
ఈక్విటీలు, డెట్ పెట్టుబడులకు ఎంత పరిమితి?
PF ట్రస్టులు తమ దగ్గర ఉన్న నిధులను వివిధ పెట్టుబడి మార్గాల్లో వినియోగించుకోవడానికి కార్మిక శాఖ పరిమితులు విధించింది.
ప్రభుత్వ సెక్యూరిటీలు, వాటికి సంబంధించిన పెట్టుబడుల్లో 45 శాతం నుంచి 65 శాతం వరకు నిధులను పెట్టవచ్చు.
డెట్ సాధనాలు, వాటికి సంబంధించిన పెట్టుబడుల్లో 35 శాతం నుంచి 45 శాతం వరకు కేటాయించవచ్చు.
స్వల్పకాలిక డెట్ సాధనాల్లో గరిష్ఠంగా 5 శాతం వరకు పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఇచ్చింది.
ఇక ఈక్విటీలు, వాటికి సంబంధించిన పెట్టుబడుల్లో 5 శాతం నుంచి 15 శాతం వరకు నిధులను వినియోగించుకోవచ్చు. ఆస్తుల ఆధారిత పెట్టుబడులు, ట్రస్టుల ద్వారా నిర్వహించే పెట్టుబడులు, ఇతర విభాగాలకు కలిపి గరిష్ఠంగా 5 శాతం పరిమితి విధించింది.
వివరాలు
ఈక్విటీలు, డెట్ పెట్టుబడులకు ఎంత పరిమితి?
ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలోనూ కొన్ని నిబంధనలు ఉన్నాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)ల్లో నమోదైన కంపెనీల షేర్లను PF ట్రస్టులు కొనుగోలు చేయవచ్చు.
అయితే ఆయా కంపెనీల మార్కెట్ విలువ కనీసం రూ.5,000 కోట్లుగా ఉండాలి.
ఆ షేర్ల ఆధారంగా రూపొందించిన డెరివేటివ్స్ కూడా ఈ రెండు స్టాక్ ఎక్స్ఛేంజ్లలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉండాలి.
వీటితో పాటు సెన్సెక్స్ లేదా నిఫ్టీ 50 సూచీలను అనుసరించే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు), ఇండెక్స్ ఫండ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టవచ్చు.
అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టే పెట్టుబడులు మొత్తం పోర్ట్‌ఫోలియోలో 5 శాతానికి మించకూడదు.
వివరాలు
PF చందాలు,పెట్టుబడులకు గడువులు ఇవే..
ఉద్యోగుల PF సొమ్ము సకాలంలో ట్రస్టులకు చేరడంతో పాటు వెంటనే పెట్టుబడిగా మారేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.
ప్రతి నెల ముగిసిన తర్వాత 15 రోజుల్లోగా యాజమాన్యాలు ఉద్యోగుల PF చందాలను సంబంధిత సంస్థ ట్రస్టీల బోర్డుకు బదిలీ చేయాలి.
ఆ తర్వాత ఆ నిధులు అందిన రెండు వారాల్లోగా ట్రస్టీలు వాటిని పెట్టుబడులుగా మళ్లించాలి.
ఉద్యోగుల చందాలు, వాటిపై వచ్చిన వడ్డీతో పాటు, తప్పనిసరిగా చెల్లించాల్సిన ఖర్చులు మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఈ నిధులుగా పరిగణిస్తారు.
వివరాలు
PF ట్రస్టులు పాటించాల్సిన ఇతర జాగ్రత్తలు..
ఉద్యోగుల పదవీ విరమణ నిధులకు భద్రత కల్పించేందుకు కార్మిక శాఖ మరికొన్ని నిబంధనలను కూడా తీసుకొచ్చింది.
పెట్టుబడుల కొనుగోళ్లు, అమ్మకాల పరిమాణాన్ని సూచించే పోర్ట్‌ఫోలియో టర్నోవర్ నిష్పత్తి.. సగటు పెట్టుబడి విలువకు రెండింతలకు మించకూడదు.
ఏదైనా పెట్టుబడికి సంబంధించిన క్రెడిట్ రేటింగ్ నిర్ణయించిన కనీస స్థాయి కంటే తగ్గితే, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ పెట్టుబడి నుంచి వైదొలగాలా? అనే విషయాన్ని ట్రస్టీలు పరిశీలించాలి.
వివరాలు
PF ట్రస్టులు పాటించాల్సిన ఇతర జాగ్రత్తలు..
అలాగే పెట్టుబడుల్లో ఉండే రిస్క్‌ను ముందుగానే అంచనా వేయాలి. నిధుల నిర్వహణలో పారదర్శకత పాటించాలి.
ఒకే కంపెనీ, ఒకే కార్పొరేట్ గ్రూప్ లేదా ఒకే రంగంలో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా వివిధ మార్గాల్లో నిధులను విభజించాలి.
పెట్టుబడుల నిర్వహణ ఖర్చులను తగ్గించడంతో పాటు, మ్యూచువల్ ఫండ్స్, ETFల విషయంలో ఒకే సేవకు రెండుసార్లు ఛార్జీలు విధించకుండా జాగ్రత్త పడాలి.
మొత్తంగా ఉద్యోగుల PF నిధులను మరింత క్రమబద్ధంగా నిర్వహించడంతో పాటు, పెట్టుబడుల ద్వారా మెరుగైన ప్రయోజనాలు పొందేలా ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్లు కార్మిక శాఖ వెల్లడించింది.
ముఖ్యంగా PF ట్రస్టులు ఈక్విటీలు, డెట్ పెట్టుబడుల్లో నిర్ణయించిన పరిమితులను పాటిస్తూ ఉద్యోగుల పదవీ విరమణ పొదుపులకు భద్రత కల్పించాల్సి ఉంటుంది.