Loading...
Lalithaa Jewellery: లలితా జువెలరీ మరో బిగ్‌ ప్లాన్‌.. త్వరలో గ్లోబల్‌ మార్కెట్‌లోకి!
లలితా జువెలరీ మరో బిగ్‌ ప్లాన్‌.. త్వరలో గ్లోబల్‌ మార్కెట్‌లోకి!

Lalithaa Jewellery: లలితా జువెలరీ మరో బిగ్‌ ప్లాన్‌.. త్వరలో గ్లోబల్‌ మార్కెట్‌లోకి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 30, 2026
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)ను పూర్తి చేసుకున్న ఆభరణాల విక్రయ సంస్థ లలితా జువెలరీ మార్ట్‌ లిమిటెడ్‌ ఇక వ్యాపార విస్తరణపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని సంస్థ సీఎండీ ఎం.కిరణ్‌కుమార్‌ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల్లో రిటెయిల్‌ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి సంస్థకు 64 షోరూములు ఉన్నాయని కిరణ్‌కుమార్‌ తెలిపారు. వీటికి అదనంగా మరో 110 కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2027 మార్చి నాటికి కనీసం 10కి పైగా కొత్త స్టోర్లను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు.

వివరాలు

మలేషియా, సింగపూర్‌లో షోరూములు

దక్షిణాదిలో షోరూముల సంఖ్యను 175కు చేర్చిన తర్వాత ఉత్తర భారత మార్కెట్లలోకి విస్తరించనున్నట్లు కిరణ్‌కుమార్‌ తెలిపారు.

తొలుత మహారాష్ట్రలో, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌, దిల్లీ మార్కెట్లలో అడుగుపెట్టనున్నట్లు చెప్పారు.

వచ్చే 2-3 నెలల్లో మలేషియాలో షోరూమ్‌ను ప్రారంభించబోతున్నట్లు కిరణ్‌కుమార్‌ వెల్లడించారు. అనంతరం సింగపూర్‌ మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న భారతీయులు, ఆసియా వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలను అత్యుత్తమ ధరలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు.

వివరాలు

తక్కువ లాభం.. ఎక్కువ విక్రయాలు

అధిక లాభాలను ఆశించకుండా తక్కువ లాభంతో ఎక్కువ విక్రయాలు సాధించడమే లలితా జువెలరీ ప్రధాన వ్యూహమని కిరణ్‌కుమార్‌ వివరించారు.

గత ఆర్థిక సంవత్సరంలో 58 షోరూముల ద్వారా రూ.25,000 కోట్ల మొత్తం ఆదాయాన్ని, రూ.1,000 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు తెలిపారు.

రానున్న రోజుల్లో షోరూముల సంఖ్య పెరిగే కొద్దీ విక్రయాల విలువ కూడా మరింత పెరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం 9 లేదా 14 క్యారెట్ల బంగారాన్ని విక్రయించే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. 22 క్యారెట్ల బంగారు ఆభరణాలనే విక్రయిస్తామని తెలిపారు.

తమ షోరూములకు వస్తున్న వినియోగదారుల్లో 60 శాతం మంది పాత బంగారాన్ని మార్పిడి చేసుకుంటున్నారని కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

బంగారం ధరలపై కిరణ్‌కుమార్‌ వ్యాఖ్యలు

తాను వ్యాపారం ప్రారంభించిన సమయంలో గ్రాము బంగారం ధర రూ.280గా ఉండేదని కిరణ్‌కుమార్‌ తెలిపారు.

కరోనా సమయంలో కిలో బంగారం ధర రూ.48 లక్షలకు చేరిందని, ప్రస్తుతం అది దాదాపు రూ.1.63 కోట్లకు చేరువలో ఉందని చెప్పారు.

బంగారం ధర ఎప్పుడూ వృద్ధి దశలోనే ఉంటుందని, అందువల్ల పసిడిని అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనంగా చూడాలని ఆయన సూచించారు.

ADVERTISEMENT