గ్రాడ్యుయేట్లకు బిల్ గేట్స్ బోధించిన 5 జీవిత సూత్రాలను తెలుసుకోండి
ఉత్తర అరిజోనా యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రసంగం చేశారు. గ్రాడ్యుయేషన్ సమయంలో తప్పకుండా తెలుసుకోవాల్సిన ఐదు ప్రధాన జీవిత సూత్రాలను బిల్ గేట్స్ ఈ సందర్భంగా విద్యార్థులతో పంచుకున్నారు. వాస్తవానికి బిల్ గేట్స్ డ్రాపౌట్ స్టూడెంట్. మైక్రోసాఫ్ట్ ప్రారంభించడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తన గ్రాడ్యుయేషన్‌ను గేట్స్ మధ్యలోనే ఆపేశారు. ఒక వేళ తాను తన కాలేజీని పూర్తి చేసి ఉంటే, తన గ్రాడ్యుయేషన్ రోజున చెప్పాలనుకున్న ఐదు విషయాలను ఇప్పుడు చెప్పాలనుకున్నట్లు బిల్ గేట్స్ పేర్కొన్నారు.
1. మీ కెరీర్ నిర్ణయాలు శాశ్వతం కావు
మొదటి సలహా ఏమిటంటే కెరీర్ నిర్ణయాలు శాశ్వతమైనవి కావు అని గేట్స్ చెప్పారు. కెరీర్ గురించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి గ్రాడ్యుయెట్లు ప్రస్తుతం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. అయితే ఆ నిర్ణయాలు శాశ్వతమైనవిగా భావించవచ్చని, కానీ అది వాస్తవం కాదన్నారు. 2. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ భయపడొద్దు మీరు కొత్త అనుభవాలు, విషయాలను నేర్చుకోవడం అత్యవసరమని గేట్స్ చెప్పారు. కొత్తదాన్ని నేర్చుకోవడానికి మొదటి అడుగు తెలిసిన వాటిపై దృష్టి పెట్టడానికి బదులుగా తెలియని వాటిపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు తమంతట తాముగా పరిష్కరించుకోలేని సమస్యలు ఎదురవుతాయని గేట్స్ చెప్పారు. అలా జరిగినప్పుడు, భయపడవద్దని, ఊపిరి పీల్చుకోవాలని, నేర్చుకోవడానికి తెలివైన వ్యక్తిని కనుక్కోవాలని వివరించారు.
3. ఇతరులకు సహాయం చేయండి
విద్యార్థులను ఉద్దేశించి గేట్స్ చేసిన ప్రసంగంలో ఇతరులకు సహాయం చేయడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. గ్రాడ్యుయేట్‌లు తమ విద్యను, నైపుణ్యాలను ఇతరుల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగించాలని చెప్పారు. 4. స్నేహం శక్తిని తక్కువ అంచనా వేయవద్దు స్నేహం శక్తిని తక్కువ అంచనా వేయవద్దని గేట్స్ చెప్పారు. స్నేహానికి ఎక్కువ విలువ ఇవ్వాలని పేర్కొన్నారు. క్లాస్ రూమ్‌లో కూర్చున్న వ్యక్తులు కేవలం క్లాస్‌మేట్స్ మాత్రమే కాదని, వాళ్లే మీ నెట్‌వర్క్ అని వెల్లడించారు. ఆ క్లాస్‌మేట్స్ భవిష్యత్ సహ వ్యవస్థాపకులు, సహచరులని చెప్పారు. గేట్స్ స్నేహితులు అతని జీవితంలో కీలక పాత్రలు పోషించారు. అతని హైస్కూల్‌మేట్ పాల్ అలెన్ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు అయ్యాడు. మరో స్నేహితుడు స్టీవ్ బాల్మెర్ మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యారు.
5. పని ఒక్కటే కాదు, జీవితంలో చాలా ఉంది
జీవితంలో పని కంటే తెలుసుకోవడానికి చాలా ఉన్నాయని బిల్ గేట్స్ పేర్కొన్నారు. అవసరమైతే విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గేట్స్ ఒక సంస్థ వ్యవస్థాపకుడిగా తన ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు. ఆఫీస్‌లో పని చేసే ఉద్యోగులను గేట్స్ గమనించేవారు. వారు ఆఫీసు నుంచి ఎంత ఆలస్యంగా వెళ్లేవారో గమనించేవారు. అయితే తాను తండ్రి అయిన తర్వాత, పని కంటే జీవితంలో ఇంకా చాలా ఉందని గ్రహించినట్లు గేట్స్ ఈ సందర్భంగా చెప్పారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో బంధాలను పెంపొందిచుకోవాలని సూచించారు. సంతోషాన్ని పంచుకోవడానికి, బాధలో ఉన్నప్పుడు ఓదార్పు కోసం దగ్గరి వ్యక్తులను కలుసుకోవాలని వివరించారు. అవసరమైతే విశ్రాంతి తీసుకోవాలని బిల్ గేట్స్ తన ఐదో సూత్రాన్ని చెప్పారు.