LOADING...
March Financial Deadline: మార్చి నెలలో ఆర్థిక పనులు పూర్తి చేయండి.. ఆదాయపు పన్ను విషయంలో నిర్లక్ష్యం వద్దు
ఆదాయపు పన్ను విషయంలో నిర్లక్ష్యం వద్దు

March Financial Deadline: మార్చి నెలలో ఆర్థిక పనులు పూర్తి చేయండి.. ఆదాయపు పన్ను విషయంలో నిర్లక్ష్యం వద్దు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్థిక సంవత్సరంలో మార్చి నెల అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. ప్రతి ఏడాదిలాగే ఈ 2026 మార్చి కూడా వ్యక్తిగతంగా,వ్యాపార పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ముఖ్యంగా ఆదాయపు పన్ను వ్యవహారాల్లో వ్యక్తులు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయి. వాటిని ముందుగానే గుర్తించి, గడువు లోపే పూర్తి చేయడం అవసరం. ఆర్థిక కార్యకలాపాల పరంగా కూడా మార్చి నెలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. బడ్జెట్‌ ప్రకారం నిధులను వినియోగించడం, ప్రభుత్వ గ్రాంట్లను పూర్తి చేయడం, వివిధ ప్రాజెక్టులను ముగించడం వంటి అనేక ఆర్థిక వ్యవహారాలు ఈ నెలలోనే తుదిదశకు చేరుతాయి. అందువల్ల మార్చి నెలను ఒక విధంగా గడువు నెలగా భావిస్తారు. ఈ సమయంలో ఖాతా పుస్తకాలను క్లోజ్‌ చేయడం అవసరం.

వివరాలు 

చాలా చెల్లింపులకు పాత పన్ను విధానంలో మినహాయింపులు

ప్రతి ఒక్కరూ ఖాతా పుస్తకాలు స్వయంగా రాయకపోయినా, వాటి నిర్వహణ తప్పనిసరి. అందుకే ఇప్పటి వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలను ఒకసారి పూర్తిగా పరిశీలించి గుర్తు చేసుకోవడం మంచిది. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు మీ బ్యాంక్‌ ఖాతా స్టేట్‌మెంట్లు, లోన్‌ ఈఎంఐ చెల్లింపులు, ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు, ఇంటి మున్సిపల్‌ పన్నులు, మెడిక్లెయిమ్‌ పాలసీల చెల్లింపులు, మీ వద్ద పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన చట్టబద్ధ చెల్లింపులు, పిల్లల విద్యకు సంబంధించిన ట్యూషన్‌ ఫీజులు, అలాగే ఆదాయపు పన్ను చట్టంలోని 80సీ కింద అర్హత పొందే పెట్టుబడులు వంటి అనేక అంశాలను ఒకసారి పరిశీలించాలి. వీటిలో చాలా చెల్లింపులకు పాత పన్ను విధానంలో మినహాయింపులు లభిస్తాయి.

వివరాలు 

ఖాతాల నిర్వహణలో అలసత్వం

అయితే మినహాయింపులకే కాకుండా ఈ చెల్లింపులను క్రమంగా చేయడం మంచి అలవాటును పెంపొందిస్తుంది. ఇది ఆర్థిక క్రమశిక్షణకు కూడా దోహదపడుతుంది. ఆర్థిక లావాదేవీలను సమయానికి పూర్తి చేయడం వల్ల ఖర్చులలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితులు స్పష్టంగా ఉండేలా చేస్తుంది. అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పొందాల్సిన ప్రయోజనాలు కూడా సకాలంలో లభిస్తాయి. కాబట్టి ఈ అంశాలను నిర్లక్ష్యం చేయకూడదు. మీ వ్యాపారం చిన్నదైనా కావచ్చు, జీఎస్‌టీలో పేర్కొన్న టర్నోవర్‌ పరిమితులలో ఉండవచ్చు, ఆడిట్‌ అవసరం లేకపోవచ్చు. అయినప్పటికీ ఖాతాల నిర్వహణలో అలసత్వం ఉండకూడదు. ముఖ్యంగా క్యాపిటల్‌ ఖర్చులు, రెవెన్యూ ఖర్చులు, సరుకుల నిల్వలు వంటి అంశాలను ఖచ్చితంగా నమోదు చేయాలి.

Advertisement

వివరాలు 

2026 మార్చి 31 నాటికి మీ ఆదాయంపై పడే పన్నుకు టీడీఎస్

జీఎస్‌టీ రిటర్నుల్లో చూపిన టర్నోవర్‌,మీ ఇన్వాయిస్‌లు,ఖాతా పుస్తకాల ప్రకారం ఉన్న టర్నోవర్‌ ఒకేలా ఉన్నాయా అనే విషయాన్ని ఒకసారి చెక్‌ చేసుకోవాలి. స్థూల ఆదాయం మొత్తము పన్నుకు లోబడదు. కొన్ని సందర్భాల్లో ఆదాయం ముందుగానే అడ్వాన్స్‌గా రావచ్చు. అయితే ఆ పని మాత్రం ఏప్రిల్‌లో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో టీడీఎస్‌కు సంబంధించిన అంశాలు కూడా వస్తాయి. సందేహాలు ఉంటే సంబంధిత వెండార్లతో మాట్లాడి వివరాలు స్పష్టంగా తెలుసుకోవాలి. ఇద్దరి రికార్డుల్లోనూ అంకెలు,వివరణలు,అకౌంటింగ్‌ వివరాలు సరిపోయేలా సమన్వయం ఉండాలి. అవసరమైతే అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాలి.2026 మార్చి 31 నాటికి మీ ఆదాయంపై పడే పన్నుకు టీడీఎస్‌ సరిపోతే సమస్య ఉండదు. లేదంటే కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిన బాధ్యత వస్తుంది.

Advertisement

వివరాలు 

మార్చి 15లోగా అడ్వాన్స్‌ ట్యాక్స్

కొన్ని సందర్భాల్లో ఆదాయ అంచనాల్లో తేడాలు రావచ్చు. దీంతో పన్ను భారం పెరగవచ్చు. గతంలో చెల్లించిన మూడు వాయిదాల్లో తక్కువ చెల్లింపులు ఉండే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ లెక్కలు వేసి సరైన మొత్తాన్ని నిర్ధారించుకోవాలి. సవరించిన లెక్కల ప్రకారం మార్చి 15లోగా అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించడం మంచిది. పాత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కొన్ని సందర్భాల్లో నోటీసులు కూడా రావచ్చు. అధికారులు హెచ్చరికలు ఇవ్వవచ్చు లేదా కొన్ని సూచనలు చేయవచ్చు. అలాంటి నోటీసుల సారాంశాన్ని పరిశీలించి అవసరమైతే రిటర్నులను సవరించుకోవచ్చు. విచారణలు, అసెస్‌మెంట్లు, జరిమానాలు వంటి సమస్యలకంటే ముందుగానే రివైజ్డ్‌ రిటర్ను దాఖలు చేయడం ఉత్తమమైన మార్గం. అవసరమైతే వెంటనే చర్యలు తీసుకోవాలి.

వివరాలు 

2026 మార్చి ముగిసేలోగా అన్ని వివరాలను సిద్ధం చేసుకోండి 

ఇవి కాకుండా జీఎస్‌టీలోని కొన్ని ప్రత్యేక పథకాలకు సంబంధించిన ప్రక్రియలు, టీడీఎస్‌ డిపాజిట్లు, టీసీఎస్‌ చెల్లింపులు, వృత్తి పన్ను చెల్లింపులు, అలాగే పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లింపులు,వాటి రిటర్నులు కూడా సమయానికి పూర్తి చేయాలి. ముఖ్యంగా టీడీఎస్‌ను తక్కువ రేటుతో వర్తింపజేయడానికి లేదా వర్తింప చేయకూడదనుకుంటే ఫారం-13 దాఖలు చేయాలి. ఈ ఫారం 2026 మార్చి 15లోగా సమర్పించడం అవసరం. అలాగే 2026 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త చట్టాలు, కొత్త నియమాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఫారాలు కూడా ప్రవేశపెట్టబడతాయి. కాబట్టి కొత్త విధానాలకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వడానికి 2026 మార్చి ముగిసేలోగా అన్ని వివరాలను సిద్ధం చేసుకోవడం మంచిది.

Advertisement