Meta Layoffs:మెటా ఈసీవో మార్క్ జుకర్‌బర్గ్ కీలక నిర్ణయం.. భారీగా ఉద్యోగ కోతలు
ఈ వార్తాకథనం ఏంటి
మెటా (META) సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ నేతృత్వంలోని ఈ టెక్ దిగ్గజ సంస్థ ఉద్యోగాలపై పెద్ద ఎత్తున కోతలు విధించేందుకు సిద్ధమైంది.
బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం,తక్కువ పనితీరు కలిగిన ఉద్యోగులను గుర్తించి, వారి స్థానాలను కొత్తవారితో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రక్రియలో మొత్తం 3,600మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.
జుకర్‌బర్గ్ ప్రకటన ప్రకారం,కంపెనీ పనితీరు సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇది కంపెనీ బలోపేతానికి దోహదపడే విధంగా,పనితీరు ఆధారంగా కోతలు చేపట్టడంతోపాటు కొత్త సిబ్బందిని నియమించడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
2023 సెప్టెంబర్ నాటికి మెటాలో 72,400 మంది ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించగా,ఈ నిర్ణయం వల్ల మొత్తం ఉద్యోగుల 5 శాతం మందిపై ప్రభావం చూపనుంది.
వివరాలు
ట్రంప్ ఫేస్‌బుక్ తొలగింపు
అమెరికా కంపెనీల్లో పనితీరు ఆధారంగా ఉద్యోగులను తొలగించడం సాధారణమే.
ఇటీవల మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం ఇలాంటి చర్యలు చేపట్టింది. ఆ సంస్థ తన మొత్తం ఉద్యోగుల్లో ఒక శాతం కంటే తక్కువ మందిని తొలగించినట్లు ప్రకటించింది.
మరొకవైపు, జుకర్‌బర్గ్ నిర్ణయం ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ స్వీకార సమయం దగ్గరపడుతున్న వేళ ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ట్రంప్, జుకర్‌బర్గ్ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, 2021లో అమెరికా పార్లమెంటు భవనంపై జరిగిన దాడి తర్వాత ట్రంప్‌ను ఫేస్‌బుక్ నుంచి నిషేధించారు. అయితే, 2023లో ట్రంప్ ఖాతాను పునరుద్ధరించారు.
వివరాలు
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఫ్యాక్ట్ చెకింగ్ ఫీచర్ తొలగింపు
అయితే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో, జుకర్‌బర్గ్ తీరులో మార్పులు కనిపిస్తున్నాయి.
ట్రంప్ విజయం సాధించిన తర్వాత జుకర్‌బర్గ్ తన నిర్ణయాలను ట్రంప్ యంత్రాంగానికి అనుకూలంగా మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ట్రంప్‌తో ఇటీవల ఒక రాత్రి భోజనానికి హాజరైనట్లు సమాచారం. అంతేకాకుండా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాక్ట్ చెకింగ్ ఫీచర్ తొలగించినట్లు ప్రకటించారు.
ఈ ఫీచర్ సెన్సార్‌షిప్‌గా పనిచేస్తోందని పలువురు విమర్శించడంతో ఇది వివాదాస్పదమైంది.