Stock Market: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు.. లాభాల్లో ముగిసిన సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు త్వరలో సానుకూల దిశలో ముందుకు సాగవచ్చన్న అంచనాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచాయి. ఈ ప్రభావంతో సూచీలు రోజంతా మెరుగైన ప్రదర్శన కనబర్చాయి. ముఖ్య సూచీ సెన్సెక్స్ 505 పాయింట్లు పెరిగి 78,493.54 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 157 పాయింట్లు లాభపడి 24,353.55 స్థాయికి చేరుకుంది. విదేశీ మారకంలో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 92.93 వద్ద నిలిచింది.
వివరాలు
బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 95.54 డాలర్లు
సెన్సెక్స్‌కు చెందిన 30 సంస్థలలో హిందుస్థాన్ యూనిలీవర్, పవర్‌గ్రిడ్ సంస్థ, రిలయన్స్, బీఈఎల్, టైటాన్ వాటాలు లాభాలను నమోదు చేశాయి. మరోవైపు సన్‌ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్ వాటాలు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 95.54 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో బంగారం ఔన్సు ధర 4,789 డాలర్ల వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి.