Stock market: మార్కెట్ పతనం.. రూ.7 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరి
ఈ వార్తాకథనం ఏంటి
అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు ఉధృతమవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, లోహ రంగాల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు దేశీయ మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. ఫలితంగా సూచీలు 1 శాతానికి పైగా క్షీణించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు పడిపోయి 90.66 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర 0.18% తగ్గి 67.41 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.7.02 లక్షల కోట్లు క్షీణించి రూ.465.46 లక్షల కోట్లకు (సుమారు 5.13 లక్షల కోట్ల డాలర్లు) తగ్గింది.
Details
ఆద్యంతం నష్టాలే
బీఎస్‌ఈ సెన్సెక్స్ 82,902.73 వద్ద నష్టాలతో ప్రారంభమైంది (మునుపటి ముగింపు 83,674.92). రోజంతా అదే ధోరణి కొనసాగిస్తూ 82,534.55 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 1,048.16 పాయింట్ల నష్టంతో 82,626.76 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 336.10 పాయింట్లు కోల్పోయి 25,471.10 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 25,444.30 కనిష్ఠం, 25,630.35 గరిష్ఠాన్ని తాకింది. వారాంతానికి సెన్సెక్స్ 953.64 పాయింట్లు, నిఫ్టీ 222.6 పాయింట్లు తగ్గాయి.
Details
ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్ మినహా అన్నీ నష్టాల్లో
సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ మినహా మిగతా అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. హిందుస్థాన్ యునిలీవర్ 4.35%, ఎటర్నల్ 4.26%, టాటా స్టీల్ 2.35%, టైటన్ కంపెనీ 2.23%, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2.17%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2.17%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.07% చొప్పున పడిపోయాయి. ఇక బజాజ్ ఫైనాన్స్ 2.43%, ఎస్‌బీఐ 0.53% లాభపడ్డాయి.
Details
ఇతర కీలక పరిణామాలు
గాడియమ్ ఐవీఎఫ్ అండ్ వుమెన్ హెల్త్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 20న ప్రారంభం కానుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.150-200 కోట్లు సమీకరించే లక్ష్యం ఉంది. హిందుస్థాన్ యునిలీవర్ నుంచి విభజన నేపథ్యంలో క్వాలిటీ వాల్స్ షేర్లు ఈ నెల 16న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్టింగ్ కానున్నాయి. వెల్డింగ్ ఉత్పత్తుల తయారీ సంస్థ ప్రీమియర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, పరుపుల సంస్థ డ్యూరోఫ్లెక్స్, ఫార్మా కంపెనీ హెగ్జాగాన్ న్యూట్రిషన్, ఓమ్ పవర్ ట్రాన్స్‌మిషన్ సంస్థల ఐపీఓలకు సెబీ ఆమోదం తెలిపింది. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్ మార్కెట్లో ప్రవేశించే ప్రణాళికలో భాగంగా నేషనల్ కమొడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ (ఎన్‌సీడీఈఎక్స్) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.