LOADING...
Stock market: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Stock market: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2026
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, అమెరికాలో వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు బలపడటం వంటి అంశాలు ప్రపంచ మార్కెట్లతో పాటు భారత మార్కెట్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. మార్కెట్ ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ ఒక దశలో 800 పాయింట్లకు పైగా నష్టపోయింది. మధ్యలో కొంత కోలుకున్నట్లు కనిపించినప్పటికీ, చివర్లో మళ్లీ అమ్మకాలు పెరగడంతో 700 పాయింట్లకు పైగా నష్టంతో ముగిసింది.

వివరాలు

లాభాల్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, బీఈఎల్

బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 73,421.61 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. గత ముగింపు 74,243.34 పాయింట్లతో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదల. రోజంతా నష్టాల్లోనే కదలాడిన సూచీ ఇంట్రాడేలో 73,318.94కనిష్ఠ స్థాయి నుంచి 73,934.35గరిష్ఠ స్థాయి వరకు ఊగిసలాడింది. చివరికి 719.08 పాయింట్లు కోల్పోయి 73,524.26 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 243.70 పాయింట్లు నష్టపోయి 23,123వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.70గా నమోదైంది. సెన్సెక్స్ 30షేర్ల సూచీలో ఎటర్నల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ట్రెంట్, ఇండిగో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మరోవైపు పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, బీఈఎల్, భారతీ ఎయిర్‌టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) షేర్లు లాభాల్లో ముగిశాయి.

వివరాలు

మార్కెట్ పతనానికి కారణాలివే

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 96.95 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఔన్సుకు 4,290 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులు ప్రపంచ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో ఆసియా మార్కెట్లు దాదాపు నష్టాల్లోనే ముగిశాయి. యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అలాగే పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల 93 డాలర్ల వద్ద ట్రేడైన క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 96 డాలర్ల స్థాయికి చేరుకోవడం భారత మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ పరిణామాలు కలిసి దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని మరింత పెంచాయి.

Advertisement