Meesho: స్టాక్ మార్కెట్‌లో మీషో దూకుడు… వారం రోజుల్లోనే 'మల్టీబ్యాగర్'గా అవతారం
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఈ-కామర్స్ రంగంలోని ప్రముఖ సంస్థ మీషో (Meesho) ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందించింది. లిస్టింగ్ అయిన కేవలం వారం రోజుల్లోనే ఈ షేర్ 'మల్టీబ్యాగర్' స్థాయికి చేరుకోవడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గురువారం (డిసెంబర్ 18) జరిగిన ట్రేడింగ్‌లో మీషో షేర్ ధర రూ. 233.50 వద్ద ఆల్‌టైమ్ హైను తాకింది. ఐపీఓ సమయంలో నిర్ణయించిన రూ. 111 ధరతో పోలిస్తే ఇది దాదాపు 110 శాతం లాభం కావడం విశేషం. అంటే కొద్దికాలంలోనే ఇన్వెస్టర్ల పెట్టుబడి రెట్టింపుకు మించి పెరిగినట్టే. మీషో షేర్లు మార్కెట్‌లో దూకుడు కొనసాగిస్తున్నాయి.
వివరాలు
ఇన్వెస్టర్లకు బంపర్ ఓపెనింగ్
వరుసగా నాలుగో రోజు కూడా లాభాల బాట పట్టిన ఈ స్టాక్, గత నాలుగు రోజుల్లోనే సుమారు 41 శాతం పెరిగింది. బీఎస్ఈలో గురువారం నాడు దాదాపు 8 శాతం లాభంతో రూ. 233.50 వద్ద ట్రేడ్ అయ్యింది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ వరుసగా 20 శాతం, 5.6 శాతం, 3.4 శాతం చొప్పున పెరగడం గమనార్హం. ఐపీఓ ధర రూ. 111గా ఉండగా, లిస్టింగ్ రోజే షేర్ ధర రూ. 162కు చేరి ఇన్వెస్టర్లకు బంపర్ ఓపెనింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా కొనుగోళ్ల ఊపుతో ధర క్రమంగా పెరిగి ప్రస్తుతం రూ. 230 స్థాయిని దాటేసింది.
వివరాలు
UBS, మీషోకు 'బై' రేటింగ్
ఈ స్టాక్‌పై నిపుణుల అభిప్రాయాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి బ్రోకరేజ్ సంస్థ UBS, మీషోకు 'బై' రేటింగ్ ఇచ్చింది. సంస్థ అనుసరిస్తున్న అసెట్-లైట్ బిజినెస్ మోడల్, వేగంగా పెరుగుతున్న యూజర్ బేస్ భవిష్యత్తులో లాభాలకు దోహదపడతాయని UBS తన నివేదికలో పేర్కొంది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ లావాదేవీల విలువ (NMV) ఏడాదికి సగటున 30 శాతం చొప్పున పెరిగే అవకాశముందని అంచనా వేసింది. ఈ స్టాక్‌కు UBS రూ. 220 టార్గెట్ ప్రైస్ నిర్ణయించినప్పటికీ, షేర్ ధర ఇప్పటికే ఆ స్థాయిని మించిపోయింది.
వివరాలు
ఐపీఓ ధరతో పోలిస్తే షేర్ ఇప్పటికే రెండింతలకు పైగా..
అయితే, ప్రస్తుతం కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఐపీఓ ధరతో పోలిస్తే షేర్ ఇప్పటికే రెండింతలకు పైగా పెరిగిందని, మార్కెట్‌లోని సానుకూల అంశాలన్నీ ధరలో ప్రతిఫలించాయని ఐఎన్‌వీ అసెట్(INVAsset)బిజినెస్ హెడ్ హర్షల్ దసానీ తెలిపారు. ఈ దశలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మీషోకు 2వ,3వ శ్రేణి నగరాల్లో మంచి పట్టున్నప్పటికీ, స్థిరమైన లాభాలను నిరూపించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఛాయిస్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ ఉత్సవ్ వర్మ మాట్లాడుతూ, సాధారణ పరిస్థితుల్లో ఈ స్టాక్ ధర రూ.200 స్థాయిలో ఉండవచ్చని, అయితే కంపెనీ అంచనాలకు మించి పనితీరు చూపిస్తే రూ. 234వరకు వెళ్లే అవకాశముందని అన్నారు.
వివరాలు
మీషో యాక్టివ్ యూజర్లు 2030 నాటికి 51.8 కోట్లకు చేరుకునే అవకాశం
అంటే ప్రస్తుతం మీషో షేర్ బుల్-కేస్ గరిష్ట స్థాయిలోనే ట్రేడ్ అవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మీషో విజయానికి కారణాలపై కూడా నిపుణులు దృష్టి సారిస్తున్నారు. UBS అంచనాల ప్రకారం, ప్రస్తుతం 19.9 కోట్లుగా ఉన్న మీషో యాక్టివ్ యూజర్లు 2030 నాటికి 51.8 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. లాజిస్టిక్స్ ఖర్చులను క్రమంగా తగ్గిస్తూ, ఆ లాభాన్ని కస్టమర్లకు అందించడం ద్వారా కంపెనీ మార్కెట్‌లో తన వాటాను పెంచుకుంటోంది. అయితే తీవ్ర పోటీ ఉన్న ఈ ఈ-కామర్స్ రంగంలో నిలదొక్కుకోవాలంటే, ప్రతి త్రైమాసికంలోనూ మెరుగైన ఫలితాలను చూపించడం మీషోకు కీలకంగా మారనుంది.