
Sabi Khan:ఆపిల్ కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా భారత సంతతి వ్యక్తి.. ఎవరీ సబీ ఖాన్?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్ ఇంక్‌లో భారతీయ మూలాలు కలిగిన సబీ ఖాన్ ఉన్నత పదవిని అధిరోహించారు. ఆయనను కంపెనీ కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా నియమించినట్లు అధికారికంగా ప్రకటించారు. గత మూడు దశాబ్దాలుగా ఆపిల్‌లో సేవలందిస్తున్న సబీ ఖాన్, ప్రస్తుతం సీఓఓగా ఉన్న జెఫ్ విలియమ్స్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెలాఖరులోగా ఆయన తన కొత్త పదవిని అధికారికంగా చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆపిల్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్)హోదాలో ఉన్న సబీ ఖాన్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆపిల్ సరఫరా గొలుసును గత అనేక సంవత్సరాలుగా విజయవంతంగా పర్యవేక్షిస్తున్నారు.
వివరాలు
సబీ ఖాన్ ఎవరు?
సబీ ఖాన్ 1966లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ పట్టణంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం ప్రారంభం సింగపూర్‌లో జరగ్గా, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం 1995లో యాపిల్ సంస్థలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతానికి యాపిల్ భారత్‌ను ఒక ప్రధాన మార్కెట్‌గా, తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న నేపథ్యంలో,సబీ ఖాన్‌ను సీఓఓగా నియమించడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
వివరాలు
సబీ ఖాన్‌పై టిమ్ కుక్ ప్రశంసలు
సబీ ఖాన్‌ను సీఓఓగా నియమించడంపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సంతోషం వ్యక్తం చేశారు. "సబీ ఒక గొప్ప వ్యూహకర్త. ఆయన యాపిల్ సరఫరా వ్యవస్థ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అత్యాధునిక తయారీ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో, ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో ఆయన పాత్ర అపూర్వం," అంటూ టిమ్ కుక్ ప్రశంసించారు.