LOADING...
Mehli Mistry: టాటా ట్రస్ట్స్‌కు మెహ్లీ మిస్త్రీ రాజీనామా..
టాటా ట్రస్ట్స్‌కు మెహ్లీ మిస్త్రీ రాజీనామా..

Mehli Mistry: టాటా ట్రస్ట్స్‌కు మెహ్లీ మిస్త్రీ రాజీనామా..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

టాటా గ్రూప్‌కు సన్నిహితుడు, వ్యాపారవేత్త మెహ్లీ మిస్త్రీ టాటా ట్రస్ట్స్‌ ట్రస్టీ పదవి నుండి వైదొలిగారు. ఈ విషయాన్ని ట్రస్ట్స్‌ ఛైర్మన్ నోయల్ టాటాకు లేఖ ద్వారా తెలియజేశారు. రతన్ టాటా రూపొందించిన విలువలు, ట్రస్ట్స్‌ ప్రతిష్ట చెరగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. ట్రస్టుల్లో జరుగుతున్న భిన్నాభిప్రాయాలు, చర్చలు సంస్థ ప్రతిష్టకు నష్టం కలిగించవచ్చని, ట్రస్టులు ఏ వివాదాల్లోనూ చిక్కుకోకూడదని తాను భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. "రతన్ టాటా ఎప్పుడూ తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజాహితాన్నే ముందుపెట్టేవారు. ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను నమ్ముతున్నాను. ఎవ్వరూ సంస్థ కంటే గొప్పవారు కాదు" అని మెహ్లీ మిస్త్రీ లేఖలో పేర్కొన్నారు.

వివరాలు 

టాటా ట్రస్ట్స్‌లో రెండు వర్గాలు

మెహ్లీ మిస్త్రీ మూడు సంవత్సరాల పదవీకాలం అక్టోబర్ 27తో ముగిసింది. అక్టోబర్ 17న జరిగిన సమావేశంలో ఆయనను లైఫ్‌టైమ్ ట్రస్టీగా కొనసాగించాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ, ముగ్గురు ట్రస్టీలు ఆమోదం ఇవ్వకపోవడంతో అది అమలు కాలేదు. ఇలా పరిస్థితులు మారుతుండటంతో రాజీనామా నిర్ణయం స్పష్టత తెచ్చినట్లైంది. ఇటీవల ఆయన మహారాష్ట్ర చారిటీ కమిషనర్ వద్ద కేసులో ఏ మార్పులు జరిగినా ముందుగా తన వాదనలు వినాలని క్యావీట్ కూడా దాఖలు చేశారు. ఈ విషయంలో టాటా ట్రస్ట్స్‌లో రెండు వర్గాలు ఉన్నట్టు తెలిసింది. నోయల్ టాటాకు వేణు శ్రీనివాసన్,మాజీ రక్షణ కార్యదర్శి విజయ్ సింగ్ మద్దతివ్వగా, మెహ్లీ మిస్త్రీకి ప్ర‌మిత్ ఝవేరీ, దర్యస్ ఖాంబాటా, జెహంగీర్ జెహంగీర్ వంటి ట్రస్టీలు అండగా ఉన్నారని తెలిసింది.

వివరాలు 

156 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రూప్‌లో సుమారు 400కిపైగా కంపెనీలు

ట్రస్టీ పునర్నియామకాలు ఏకగ్రీవంగా ఉండాలా? లేక స్వయంచాలకంగా పునరుద్ధరించాలా? అనే అంశం ఇరువర్గాల మధ్య విభేదాలకు దారితీసింది. టాటా ట్రస్ట్స్ అనేది సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ సహా అనేక సేవా సంస్థలను పర్యవేక్షించే కీలక సంస్థ. ఇది టాటా గ్రూప్‌ హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్‌లో 66% వాటాను కలిగి ఉంది. 156 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రూప్‌లో సుమారు 400కిపైగా కంపెనీలు, అందులో 30కు పైగా స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ సంస్థలు ఉన్నాయి.