Meta: మెటాలో భారీ ఉద్యోగ కోతలు: 1000 మంది ఉద్యోగులపై వేటు
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియా రంగంలోని ప్రముఖ సంస్థ మెటా (Meta) తన వ్యాపార విధానాల్లో కీలక మలుపు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో సంస్థలోని 'రియాలిటీ ల్యాబ్స్' (Reality Labs) విభాగంలో భారీ స్థాయిలో ఉద్యోగాల కోత పెట్టింది. ఈ నిర్ణయంతో 1,000 మందికిపైగా సిబ్బందిని తొలగించినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. 2026 సంవత్సరంలో మెటా చేపట్టిన తొలి పెద్ద లేఆఫ్ ఇదేనని సమాచారం.
వివరాలు
మెటావర్స్ నుంచి ఏఐ దిశగా అడుగులు
గత కొన్ని సంవత్సరాలుగా మెటావర్స్ (Metaverse)లక్ష్యంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, తాజాగా తన వ్యూహాన్ని మార్చుకున్నారు. ఇకపై కంపెనీ ప్రధాన దృష్టి మెటావర్స్ కంటే ఏఐ ఆధారిత పరికరాల (AI Devices) అభివృద్ధిపైనే ఉండనుంది. ఈ వ్యూహాత్మక మార్పులో భాగంగానే రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో ఉద్యోగాల తగ్గింపు తప్పనిసరి అయిందని తెలుస్తోంది. ఈ విభాగంలో మొత్తం దాదాపు 15,000 మంది ఉద్యోగులు ఉండగా,తాజా నిర్ణయంతో అందులో సుమారు 10శాతం మంది ఉపాధిని కోల్పోయారు. మంగళవారం ఉదయం నుంచే తొలగింపుల ప్రక్రియ ప్రారంభమైందని, ప్రభావిత ఉద్యోగులకు ఇప్పటికే సమాచారం అందినట్లు తెలిసింది.
వివరాలు
లేఆఫ్స్‌కు కారణమిదే
మెటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రూ బోస్వర్త్ ఉద్యోగులకు అంతర్గతంగా పంపిన సందేశం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నిర్ణయంపై కంపెనీ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ కీలక వివరాలు వెల్లడించారు. "మెటావర్స్‌కు కేటాయిస్తున్న పెట్టుబడులను కొంత మేర తగ్గించి, ధరించగలిగే సాంకేతిక పరికరాలు (Wearables) వైపు దృష్టి మళ్లిస్తున్నామని గత నెలలోనే స్పష్టం చేశాం. ఆ మార్పులో భాగంగానే ఇప్పుడు ఈ చర్యలు తీసుకున్నాం. దీని ద్వారా ఆదా అయ్యే నిధులను ఈ ఏడాది వేరబుల్స్ విభాగం అభివృద్ధికి మళ్లిస్తాం" అని తెలిపారు.
వివరాలు
లేఆఫ్స్‌కు కారణమిదే
సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని మెటా తన ప్రాధాన్యాలను పునర్వ్యవస్థీకరిస్తోంది. ఒకప్పుడు సంస్థ భవిష్యత్తుగా భావించిన మెటావర్స్ ప్రాజెక్టుల కంటే, ప్రస్తుతం విస్తృత ఆదరణ పొందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), స్మార్ట్ వేరబుల్స్ ద్వారానే త్వరిత ఫలితాలు సాధ్యమవుతాయని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.