
Code by Bots: మెటా AI మానవ ఇంజనీర్లను అధిగమిస్తుంది.. జుకర్‌బర్గ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధ (AI - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రభావం రోజు రోజుకీ పెరుగుతోంది.
అనేక రంగాల్లో ఇది వేగంగా విస్తరిస్తుండటంతో, భవిష్యత్తులో ప్రతిదీ ఏఐ ఆధారితమవుతుందన్న భావన బలపడుతోంది.
ఈ నేపథ్యంలో, మెటా సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
లామా ప్రాజెక్ట్‌కు సంబంధించి చాలావరకు కోడింగ్‌ను ఏఐయే పూర్తిచేస్తుందని జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు.
వివరాలు
12 నుంచి 18 నెలల్లో ప్రధాన కోడింగ్ పనులు పూర్తిగా ఏఐచేత
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జుకర్‌బర్గ్, మెటాలో కృత్రిమ మేధ వాడకంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఇప్పటికే ఏఐ ఒక బృంద సభ్యుడిలా పనిచేస్తోందని చెప్పారు. త్వరలోనే అత్యుత్తమ కోడర్లకంటే మెరుగ్గా ఏఐ పనిచేస్తుందని పేర్కొన్నారు.
మీరు ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశిస్తే, ఆ పని తక్కువ సమయానికే సమర్థవంతంగా పూర్తి చేయగలదని చెప్పారు.
బగ్‌లను గుర్తించడంలోనూ, నాణ్యమైన కోడ్‌ను స్వయంగా తయారు చేయడంలోనూ ఏఐకు ఎంతో సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రత్యేకించి, మెటా కంపెనీ అభివృద్ధి చేస్తున్న 'లామా ప్రాజెక్ట్'లో రాబోయే 12 నుంచి 18 నెలల్లో ప్రధాన కోడింగ్ పనులు పూర్తిగా ఏఐచేత జరగనున్నాయని చెప్పారు.
వివరాలు
కృత్రిమ మేధ పాత్ర కీలకం
కేవలం మెటా మాత్రమే కాకుండా, ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఏఐపై ఇదే ధోరణి చూపిస్తున్నాయి.
ఇటీవల మెటా లామా ఏఐ డెవలపర్ ఈవెంట్‌లో పాల్గొన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, తమ కంపెనీలో 20 నుంచి 30 శాతం కోడ్‌ను ఇప్పటికే కృత్రిమ మేధతో తయారుచేస్తున్నామని తెలిపారు.
నాణ్యత పెంచేందుకు ఏఐ ఆధారిత టూల్స్‌పై ఆధారపడటం ఎక్కువవుతోందని చెప్పారు.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఇదే విషయాన్ని పంచుకున్నారు.
గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ కోడ్ తయారీలో కృత్రిమ మేధ పాత్ర దాదాపుగా కీలకంగా మారిందని చెప్పారు.
ఏఐ రూపొందించిన కోడ్‌ను ఇంజినీర్లు పరిశీలిస్తున్నప్పటికీ, దాని వినియోగం పెద్దఎత్తున పెరిగిందని వివరించారు.