
RS.500: మార్కెట్లోకి వచ్చిన సరికొత్త 500 రూపాయల నోట్లతో జాగ్రత్త .. హోంశాఖ హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన రూ.500 విలువ గల నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించినట్లు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ విషయాన్ని ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
దీనికి సంబంధించి సమాచారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీతో కూడా పంచుకున్నట్లు వెల్లడించారు.
ఈ నకిలీ నోట్ల ముద్రణ, వాటి నాణ్యత, అసలైన నోట్లను తలపించేలా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. వాటిని గుర్తించడం సులభం కాదని, చాలా క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు.
వివరాలు
చిన్న తప్పును గుర్తించాలంటే, నోటును చాలా జాగ్రత్తగా పరిశీలించాలి
అయితే ఈ నకిలీ నోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్ పొరపాటు ఉందని అధికారులు గుర్తించారు.
అదే ఈ నోట్లను అసలైన వాటిలోంచి వేరు చేయడంలో కీలకమవుతుందని చెప్పారు.
''RESERVE BANK OF INDIA'' అని ఉండాల్సిన చోట, ''RESERVE'' అనే పదంలో చివరి 'E' అక్షరం స్థానంలో 'A' ఉండే విధంగా ముద్రించారని వెల్లడించారు.
ఈ చిన్న తప్పును గుర్తించాలంటే, నోటును చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇలాంటి నకిలీ నోట్లు ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పుగా మారుతాయని అధికారులు స్పష్టం చేశారు.
అందుకే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, సంబంధిత ఏజెన్సీలను అప్రమత్తంగా ఉండేలా సూచనలు ఇచ్చారు.
వివరాలు
ప్రజలు,వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలి
ఇప్పటికే ఈ నకిలీ నోట్లు పెద్ద సంఖ్యలో మార్కెట్లోకి చేరిపోయినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.
వాటి ఖచ్చిత సంఖ్యను గుర్తించడం చాలా కష్టమైన పని అని ఉగ్రవాదానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలపై దర్యాప్తు నిర్వహిస్తున్న ఓ అధికారి తెలిపారు.
ప్రజలు,వ్యాపార సంస్థలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలున్నాయి.