Satya Nadella: ఏఐ దిశగా అడుగులు వేస్తున్న మైక్రోసాఫ్ట్.. కొత్త నియామకాలకు సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ రంగంలో (Artificial Intelligence) తన ఆధిపత్యాన్ని మరింత బలపరచాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ (Microsoft) త్వరలో భారీ నియామకాలకు సిద్ధమవుతోంది. ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో పలు విభాగాల్లో ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్, ఇప్పుడు ఏఐ (AI) ఆధారిత విస్తరణ దిశగా ముందుకు వెళ్తోంది. బీజీ2 పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సత్య నాదెళ్ల మాట్లాడుతూ, భవిష్యత్తులో కంపెనీ విస్తరణ మరింత స్మార్ట్‌గా, ఆటోమేషన్ ఆధారంగా, వ్యూహాత్మకంగా ఉండబోతుందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఏఐ మార్పులను గతంలో ఫ్యాక్స్‌ల నుంచి ఈమెయిల్స్, స్ప్రెడ్‌షీట్లకు జరిగిన విప్లవంతో పోల్చారు. 'మా సంస్థలో ఉద్యోగుల సంఖ్యను పెంచబోతున్నామన్నారు.
Details
సమర్థవంతంగా పనిచేయగలిగే వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యం
రాబోయే నియామకాలు మొత్తం ఏఐ ఆధారిత విప్లవాన్ని మరింత వేగవంతం చేసే దిశగా ఉండనున్నాయని నాదెళ్ల అన్నారు. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు 365 కోపైలట్, గిట్‌హబ్ ఏఐ కోడింగ్ హెల్పర్ వంటి టూల్స్ యాక్సెస్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉద్యోగులు కృత్రిమ మేధ సాయంతో మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేయగలిగే వాతావరణాన్ని సృష్టించడమే తమ ప్రధాన లక్ష్యమని నాదెళ్ల వివరించారు. ఉద్యోగుల సంఖ్య పరంగా గత ఏడాది పెద్దగా మార్పులు లేనప్పటికీ, 2022 ఆర్థిక సంవత్సరానికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య ఏటా 22 శాతం మేర పెరిగింది. అయితే, ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ సుమారు 15,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. అయినప్పటికీ, మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,00,000 మార్కును దాటింది.