LOADING...
Microsoft: 2026 మధ్య నాటికి భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ అతిపెద్ద డేటా సెంటర్‌ ప్రారంభం
2026 మధ్య నాటికి భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ అతిపెద్ద డేటా సెంటర్‌ ప్రారంభం

Microsoft: 2026 మధ్య నాటికి భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ అతిపెద్ద డేటా సెంటర్‌ ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2026
08:18 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ సాంకేతిక రంగ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారీ డేటా సెంటర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు వేగవంతం చేసింది. దక్షిణ భారతదేశంలో సాంకేతిక రంగానికి కేంద్రంగా ఎదిగిన హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మైక్రోసాఫ్ట్‌ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు పునీత్‌ చందోక్‌ తెలిపారు. దేశంలో కృత్రిమ మేధ సేవలు, క్లౌడ్‌ ఆధారిత సాంకేతిక సేవలకు డిమాండ్‌ భారీగా పెరుగుతున్నందున ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మైక్రోసాఫ్ట్‌ అందిస్తున్న అజూర్‌ క్లౌడ్‌ సేవలు, కోపైలెట్‌ 365 కృత్రిమ మేధ సహాయక సేవలకు భారత్‌లో విశేష ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.

వివరాలు 

రూ.1.45 లక్షల కోట్ల భారీ పెట్టుబడి

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సమాచార సాంకేతిక మార్కెట్లలో భారత్‌ ముందంజలో నిలుస్తోంది. దేశంలో 100 కోట్ల మందికిపైగా అంతర్జాల వినియోగదారులు ఉండటం, నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండటం సంస్థలను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది చివర్లో మైక్రోసాఫ్ట్‌ రూ.1.45 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. ఇందులో అధిక భాగం హైదరాబాద్‌లోని డేటా సెంటర్ల విస్తరణకే వినియోగించనుంది. ప్రస్తుతం పుణె, చెన్నై, ముంబయిల్లో మైక్రోసాఫ్ట్‌కు డేటా సెంటర్లు ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో నిర్మిస్తున్న సముదాయం సంస్థకు దేశంలోనే అతిపెద్ద కేంద్రంగా నిలవనుంది.

వివరాలు 

డేటా భద్రత చట్టానికి అనుగుణంగా

దేశంలో అమల్లోకి వచ్చిన డిజిటల్‌ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం ప్రకారం వినియోగదారుల సమాచారం స్థానిక సర్వర్లలోనే భద్రపరచాల్సి ఉంటుంది. ఈ నిబంధనల అమలులో హైదరాబాద్‌లో నిర్మిస్తున్న మైక్రోసాఫ్ట్‌ భారీ డేటా సెంటర్‌ కీలక పాత్ర పోషించనుంది. గూగుల్‌, అమెజాన్‌ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి పోటీ ఉన్నప్పటికీ, మౌలిక వసతుల కల్పనలో తాము ముందున్నామని పునీత్‌ చందోక్‌ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

వివరాలు 

భారతీయ ఇంజినీర్ల కీలక పాత్ర

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ విడుదల చేస్తున్న పలు కృత్రిమ మేధ సాంకేతిక ఫీచర్ల రూపకల్పనలో భారతీయ ఇంజినీర్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌లో 22 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. కృత్రిమ మేధ రంగంలో నిపుణుల అవసరం రోజురోజుకూ పెరుగుతోందని, ప్రతిభావంతులను ఎంపిక చేయడం పరిశ్రమకు పెద్ద సవాలుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సవాళ్లను అధిగమిస్తూ భారత్‌లో కృత్రిమ మేధ విప్లవానికి మైక్రోసాఫ్ట్‌ ముందుండి నడిపిస్తుందని స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

షాద్‌నగర్‌ పరిసరాల్లో భారీ నిర్మాణాలు

హైదరాబాద్‌ సమీపంలోని షాద్‌నగర్‌లో 41 ఎకరాలు, మేకగూడలో 22 ఎకరాలు, చందన్‌వెల్లిలో 53 ఎకరాల విస్తీర్ణంలో మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్ల సముదాయాన్ని నిర్మిస్తోంది. అదనంగా కొత్తూర్‌, నందిగామ ప్రాంతాల్లో కూడా సంస్థ స్థలాలను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఐటీ సంస్థల నుంచి భారీ మద్దతు దేశీయ సమాచార సాంకేతిక సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌తో పాటు కాగ్నిజెంట్‌ వంటి సంస్థలు మైక్రోసాఫ్ట్‌ కృత్రిమ మేధ సేవలను పెద్దఎత్తున వినియోగిస్తున్నాయి. ఈ సంస్థలు ఒక్కొక్కటి దాదాపు 50 వేలకుపైగా కోపైలెట్‌ లైసెన్సులను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో మౌలిక వసతుల అవసరం మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

Advertisement