Microsoft: మార్కెట్ విలువలో ఎన్విడియాను వెనక్కి నెట్టిన మైక్రోసాఫ్ట్
ఈ వార్తాకథనం ఏంటి
మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ విషయంలో ఎన్విడియాను వెనక్కి నెట్టింది. 2025 జూన్ తర్వాత తొలిసారిగా ఈ రెండు టెక్ దిగ్గజాల ర్యాంకులు మారాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఎన్విడియా షేర్లు భారీగా పడిపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. రాయిటర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 10, 2026న రాత్రి 10.03 గంటల AST సమయానికి ఎన్విడియా షేర్లు 6.1శాతం తగ్గి 167.8డాలర్లకు చేరాయి. మరోవైపు మైక్రోసాఫ్ట్ షేర్లు కూడా 2.1శాతం పడిపోయి 533.7డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. అయితే మార్కెట్ విలువలో మైక్రోసాఫ్ట్ 3.9లక్షల కోట్ల డాలర్లతో ముందంజలో నిలిచింది. నవంబర్ 10న రాత్రి 8.39 గంటల AST సమయానికి ఎల్ఎస్‌ఈజీ అందించిన గణాంకాల ఆధారంగా మైక్రోసాఫ్ట్ ఇన్వెస్టర్ రిలేషన్స్ వెబ్‌సైట్ ఈ వివరాలను వెల్లడించింది.
వివరాలు
హువాంగ్‌పై ఆరోపణలు.. స్వతంత్ర విచారణకు ఎన్విడియా బోర్డు నిర్ణయం
ఎన్విడియా వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై విదేశీ నిఘా సంస్థ నిఘా పెట్టిందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో కంపెనీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ చేపట్టనున్నట్లు నవంబర్ 8న ప్రకటించింది.
స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన కమిటీ ఈ విచారణను పర్యవేక్షించనుంది.
ఇందుకోసం బయటి న్యాయ నిపుణుల సహాయం కూడా తీసుకోనున్నారు. కంపెనీ రహస్యాలు లేదా జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం బయటకు వెళ్లిందని భావించడానికి ప్రస్తుతానికి ఎలాంటి కారణాలు లేవని బోర్డు స్పష్టం చేసింది.
అందుబాటులో ఉన్న అన్ని వివరాలను పరిశీలించిన తర్వాతే పూర్తి సమాచారం వెల్లడిస్తామని తెలిపింది.
వివరాలు
మైక్రోసాఫ్ట్ ఆర్థిక ఫలితాల్లో భారీ వృద్ధి
హువాంగ్ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది.
మరోవైపు ఈ విచారణకు తన పూర్తి సహకారం అందిస్తానని, ఎన్విడియా పట్ల తన నిబద్ధత కొనసాగుతుందని హువాంగ్ నవంబర్ 8న ఉద్యోగులకు పంపిన సందేశంలో వెల్లడించారు.
ఫోర్బ్స్ అంచనాల ప్రకారం నవంబర్ 10, 2026 నాటికి హువాంగ్ నికర సంపద 145.8బిలియన్ డాలర్లుగా ఉంది.
మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కూడా కంపెనీ వృద్ధిని సూచిస్తున్నాయి.
సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 19శాతం పెరిగి 92.3 బిలియన్ డాలర్లకు చేరింది.
నికర లాభం 32శాతం వృద్ధితో 36.6బిలియన్ డాలర్లుగా నమోదైంది. అక్టోబర్ 28న విడుదల చేసిన ఆర్థిక నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
వివరాలు
క్లౌడ్ ఆదాయంలో భారీ వృద్ధి..
క్లౌడ్ విభాగం ఆదాయం 30 శాతం పెరిగి 63.9 బిలియన్ డాలర్లకు చేరగా.. అజ్యూర్ ఆదాయం 48 శాతం వృద్ధి చెందింది.
భవిష్యత్తులో అందించాల్సిన వాణిజ్య సేవలకు సంబంధించిన ఒప్పందాల విలువ 73 శాతం పెరిగి 677 బిలియన్ డాలర్లకు చేరింది.
ఒక్కో షేరుపై ఆదాయం కూడా 32 శాతం పెరిగి 4.92 డాలర్లుగా నమోదైంది.
ఇదే త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా 58 బిలియన్ డాలర్ల నగదు సమకూరగా.. ఆస్తులు, పరికరాల కొనుగోలు కోసం 39.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
వివరాలు
ఎన్విడియా ఆదాయంలో భారీ వృద్ధి.. ఏఐ రంగమే కీలకం
మరోవైపు ఎన్విడియా కూడా భారీ ఆదాయ వృద్ధిని నమోదు చేసింది.
జులై 26తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 106 శాతం పెరిగి 96.2 బిలియన్ డాలర్లకు చేరింది.
నికర లాభం 126 శాతం వృద్ధితో 59.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆగస్టు 26న విడుదల చేసిన ఆర్థిక నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
ముఖ్యంగా డేటా సెంటర్ విభాగం ఆదాయం 117 శాతం పెరిగి 89 బిలియన్ డాలర్లకు చేరింది.
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సేవలకు అవసరమైన కంప్యూటింగ్ వ్యవస్థలను అందించడంలో ఎన్విడియా కీలక పాత్ర పోషిస్తోంది.
వివరాలు
వెరా రూబిన్ ప్లాట్‌ఫామ్‌తో ఏఐ రంగంలో మరింత దూకుడు
తమ వెరా రూబిన్ ప్లాట్‌ఫామ్ పూర్తిస్థాయి ఉత్పత్తి దశకు చేరుకుంటోందని కంపెనీ తెలిపింది.
మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెబియస్ వంటి సంస్థల వద్ద ఈ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన ర్యాక్‌లు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆదాయం 108 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేసింది.
దీనిలో రెండు శాతం అటూ ఇటుగా మార్పు ఉండవచ్చని తెలిపింది. చైనా నుంచి డేటా సెంటర్ కంప్యూటింగ్ ఆదాయం ఏదీ ఉండదనే అంచనాతో ఈ గణాంకాలను రూపొందించినట్లు ఎన్విడియా స్పష్టం చేసింది.