LOADING...
Service Now: ఏజెంటిక్‌ ఏఐ దెబ్బకు లక్షలాది ఉద్యోగాలు గల్లంతు!
ఏజెంటిక్‌ ఏఐ దెబ్బకు లక్షలాది ఉద్యోగాలు గల్లంతు!

Service Now: ఏజెంటిక్‌ ఏఐ దెబ్బకు లక్షలాది ఉద్యోగాలు గల్లంతు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏజెంటిక్‌ కృత్రిమ మేధ (AI)తో కొత్త తరం సాంకేతికతలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లు ఒక తాజా నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా తయారీ, రిటైల్‌, విద్య రంగాల్లో 2030 నాటికి 1.8 కోట్ల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడనుందని సర్వీస్‌నౌ వెల్లడించింది. తయారీ రంగంలోనే సుమారు 80 లక్షల మందిపై ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. అలాగే రిటైల్‌ రంగంలో 76 లక్షల మంది, విద్య రంగంలో 25 లక్షలకు పైగా ఉద్యోగాలు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. నివేదికలో హై-ఆటోమేషన్‌ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పెద్ద ఎత్తున ఉంటుందని వివరించింది.

Details

ఏఐ వల్ల ఉద్యోగ భద్రతపై ఆందోళనలు

ఛేంజ్‌ మేనేజర్లు, పేరోల్‌ క్లర్క్‌లు వంటి ఉద్యోగాలను ఏఐ ఏజెంట్లు సమన్వయంతో సులభంగా నిర్వహించగలవని తెలిపింది. అయితే ఇంప్లిమెంటేషన్‌ కన్సల్టెంట్లు, సిస్టమ్‌ అడ్మిన్‌లు వంటి హై-ఆగ్మెంటేషన్‌ ఉద్యోగాల్లో ఏఐతో పోటీ కాకుండా భాగస్వామ్య దృష్టితో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇప్పటికే ఐటీ దిగ్గజం టీసీఎస్‌ సంస్థ తన ఉద్యోగులలో 2 శాతం లేదా 12,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన నేపథ్యంలో, ఏఐ వల్ల ఉద్యోగ భద్రతపై ఆందోళనలు ముదిరాయి.

Details

2030 నాటికి 30 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు

ఏజెంటిక్‌ ఏఐ 2030 నాటికి 30 లక్షలకు పైగా కొత్త టెక్‌ ఉద్యోగాలను సృష్టించగలదని సర్వీస్‌నౌ ఇండియా టెక్నాలజీ అండ్‌ బిజినెస్‌ సెంటర్‌ ఎండీ సుమీత్ మాథుర్‌ అభిప్రాయపడ్డారు. అలాగే 1.35 కోట్ల ఉద్యోగాలను పునర్నిర్మించడంతో పాటు వాటికి కొత్త నిర్వచనాలు ఇవ్వవచ్చునని తెలిపారు. సర్వీస్‌నౌ 500కు పైగా సంస్థలతో నిర్వహించిన సర్వేలో కంపెనీలు ఇప్పటికే తమ టెక్నాలజీ బడ్జెట్‌లో 13.5 శాతం ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి. ఈ సంస్థలలో ప్రతి నాలుగో కంపెనీ ఏఐ దిశగా అడుగులు వేస్తున్నట్లు నివేదిక తెలిపింది.

Details

డేటా భద్రతపై ఆందోళనలు

ఇక భారతీయ కంపెనీల విషయానికి వస్తే, వాటిలో 30 శాతం సంస్థలు డేటా భద్రతను ప్రధాన ఆందోళనగా గుర్తించాయని పేర్కొంది. మరో 26 శాతం కంపెనీలు భవిష్యత్‌ నైపుణ్యాల అవసరాల విషయంలో స్పష్టత లేకుండా ఉన్నాయని వివరించింది. ఈ పరిస్థితి వ్యూహాత్మక దృష్టితోపాటు నిర్మాణాత్మకమైన క్రాస్‌-ఫంక్షనల్‌ రీస్కిల్లింగ్‌ అవసరాన్ని స్పష్టం చేస్తోందని నివేదిక స్పష్టం చేసింది.