Loading...
Moody's: మధ్యప్రాచ్య సంక్షోభం వేళ భారత్‌కు ఊరట.. 7% వృద్ధి అంచనా పెంచిన మూడీస్
7% వృద్ధి అంచనా పెంచిన మూడీస్

Moody's: మధ్యప్రాచ్య సంక్షోభం వేళ భారత్‌కు ఊరట.. 7% వృద్ధి అంచనా పెంచిన మూడీస్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్య సంక్షోభం ప్రభావాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా కొనసాగుతుండటాన్ని పరిగణనలోకి తీసుకున్న రేటింగ్స్‌ సంస్థ మూడీస్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాను 6శాతం నుంచి 7శాతానికి పెంచింది. అయితే దేశ సార్వభౌమ రుణ భారం,రుణ చెల్లింపుల సామర్థ్యం,తలసరి ఆదాయం వంటి అంశాలు ఇప్పటికీ భారత క్రెడిట్‌ ప్రొఫైల్‌పై ఒత్తిడి పెంచుతున్నాయని పేర్కొంది. భారత్‌ రుణ చెల్లింపు సామర్థ్యానికి ఇచ్చిన రేటింగ్‌ను 'Baa3'గా, దాని భవిష్యత్తు ఆర్థిక అంచనాను 'స్థిరంగా' మూడీస్‌ కొనసాగించింది. ఇతర జీ20 దేశాలతో పాటు, సమాన రేటింగ్‌ ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్‌ వేగంగా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నప్పటికీ.. కొన్ని సవాళ్లు కొనసాగుతున్నాయని సంస్థ నివేదికలో తెలిపింది.

వివరాలు 

ఇంధన ధరలు, ఎల్‌నినోతో వృద్ధికి సవాళ్లు

ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడం,ఎల్‌నినో ప్రభావంతో ఆహార ధరలపై ఒత్తిడి ఏర్పడటం వల్ల ద్రవ్యోల్బణం,వినియోగం,ఆర్థిక వృద్ధికి ముప్పు ఉండొచ్చని మూడీస్‌ హెచ్చరించింది.

మధ్యప్రాచ్య సంక్షోభానికి భారత్‌ ఆర్థిక విధానపరంగా ఇప్పటివరకు పరిమిత స్థాయిలోనే స్పందించిందని పేర్కొంది.

అయితే అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగితే సబ్సిడీల కోసం ప్రభుత్వం చేసే వ్యయం పెరగొచ్చని, అదనపు ఆర్థిక సహాయం అందించాల్సిన పరిస్థితి రావచ్చని తెలిపింది.

రక్షణ,మౌలిక సదుపాయాల రంగాల్లో పెరుగుతున్న ఖర్చులు ఆర్థిక లోటును తగ్గించే ప్రక్రియకు అడ్డంకిగా మారొచ్చని వివరించింది.

ఇదిలా ఉండగా.. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8శాతం వృద్ధి చెందింది.

గత నెలలో విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. పెట్టుబడులు,తయారీ రంగంలో పుంజుకున్న కార్యకలాపాలు ఈ వృద్ధికి ప్రధాన కారణమయ్యాయి.

వివరాలు 

భారత్‌ వృద్ధిపై ఎస్‌అండ్‌పీ అంచనా

అయితే గనుల రంగం, వినియోగదారులపై ఆధారపడిన సేవల రంగాల్లో కొంత బలహీనత కనిపించింది.

ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఆగస్టు 27, 2026న విడుదల చేసిన నివేదికలోనూ ఇంధన ధరలు పెరగడం, వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న సవాళ్ల కారణంగా ఈ ఏడాది భారత్‌ వృద్ధి స్వల్పంగా మందగించొచ్చని పేర్కొంది.

అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రాథమిక అంశాలు బలంగానే ఉంటాయని, రానున్న రెండు, మూడేళ్లలోనూ వృద్ధికి అవి మద్దతు ఇస్తాయని తెలిపింది.

భారత్‌కు దీర్ఘకాలిక సార్వభౌమ క్రెడిట్‌ రేటింగ్‌ను 'BBB'గా, స్వల్పకాలిక రేటింగ్‌ను 'A-2'గా కొనసాగించినట్లు వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు 

వ్యవసాయంపై ఎల్‌నినో ప్రభావం.. ఇతర రంగాలతో కొంత ఊరట

ఎల్‌నినో కారణంగా వర్షపాతం తగ్గడం, మధ్యప్రాచ్య యుద్ధం ప్రభావంతో వ్యవసాయ ఉత్పాదక వ్యయాలు మారుతూ ఉండటం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడొచ్చని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ తెలిపింది.

భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా సుమారు 18 శాతం కాగా, 43 శాతం శ్రామికశక్తి ఈ రంగంపైనే ఆధారపడి ఉందని పేర్కొంది.

అయితే ఇటీవలి సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ సేవలు, ముఖ్యంగా ఆర్థిక సేవలు, సాంకేతిక రంగాలు, మౌలిక సదుపాయాల పెట్టుబడులు, తయారీ రంగం వైపు విస్తరించడం వల్ల బలహీన రుతుపవనాల ప్రభావాన్ని కొంతమేర తగ్గించే అవకాశం ఉందని వివరించింది.

ADVERTISEMENT