Meta: ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాపై 40 రాష్ట్రాల దావా
కాలిఫోర్నియా, న్యూయార్క్ సహా దాదాపు 40వరకు అమెరికా రాష్ట్రాలు ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాపై ఫెడరల్ కోర్టులో దావా వేశాయి. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు పిల్లలు, యువత మానసిక ఆరోగ్య సంక్షోభానికి దోహదపడుతున్నాయంటూ ఆయా రాష్ట్రాలు దావాలో పేర్కొన్నాయి. తల్లిదండ్రుల అనుమతి లేకుండా 13 ఏళ్లలోపు పిల్లల డేటాను మెటా సేకరిస్తోందని ఆరోపించాయి. యువతను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో నిమగ్నం చేయడానికి చాలా శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మెటా ఉపయోగిస్తోందని, ఆర్థిక లాభాలను పెంచుకోవడానికి, మెటా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ప్రమాదాల గురించి ప్రజలను పదేపదే తప్పుదారి పట్టించిందని ఫిర్యాదులో రాష్ట్రాలు పొందుపర్చాయి.
యువత మానసిక ఆరోగ్యంతో బాధపడటానికి 'మెటా'నే కారణం: న్యూయార్క్ అటార్నీ జనరల్
పిల్లలు, యువత రికార్డు స్థాయిలో మానసిక ఆరోగ్యంతో బాధపడటానికి మెటా వంటి సోషల్ మీడియా కంపెనీలే కారణమని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ పేర్కొన్నారు. పిల్లలను మెటా సంస్థ తన ప్లాట్‌ఫారమ్‌లకు బానిసలుగా మార్చే మానిప్యులేటివ్ ఫీచర్‌లను ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చినట్లు జేమ్స్ వివరించారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఆరోపణలపై మెటా స్పందించింది. టీనేజ్‌లకు ఆన్‌లైన్‌లో సురక్షితమైన, సానుకూల అనుభవాలను అందించడానికి తాము ఇప్పటికే తమ ప్రయత్నాలను అమలు చేస్తున్నట్లు పేర్కొంది. టీనేజర్లు ఉపయోగించే అనేక యాప్‌ల కోసం స్పష్టమైన, వయస్సు-తగిన ప్రమాణాలను రూపొందించడానికి సోషల్ మీడియా రంగంలోని కంపెనీలతో పనిచేయడానికి బదులుగా.. అటార్నీ జనరల్ ఇలా దావా వేయడం వల్ల తాము నిరాశ చెందినట్లు మెటా వెల్లడించింది.