
Gold loans: బంగారం రుణాల మార్గదర్శకాలకు ఆర్‌బీఐ సిద్ధం.. ఆ సంస్థల షేర్లు డౌన్
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం తాకట్టు పెట్టి పొందే రుణాలపై మరింత కఠిననియమాలు త్వరలో అమల్లోకి రానున్నాయి.
దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ)అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రకటన వెలువడిన వెంటనే,ముత్తూట్ ఫైనాన్స్,ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ వంటి ప్రముఖబంగారు రుణసంస్థల షేర్ల విలువలు గణనీయంగా పడిపోయాయి.
ఇటీవలి కాలంలో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే పద్ధతి విపరీతంగా పెరిగిపోయింది.
దీనివల్ల సంభవించవచ్చే ప్రమాదాలను నివారించేందుకు,ఆర్‌బీఐ చొరవ తీసుకొని నియంత్రణ చర్యలకు సిద్ధమవుతోందన్న వార్తలు గతంలో వచ్చాయి.
తాజాగా ఆర్‌బీఐ ఈవిషయంపై స్పందిస్తూ,వివిధ నియంత్రణ సంస్థలు ఇప్పటికే అమలు చేస్తున్న మార్గదర్శకాల మధ్య సమన్వయం సాధించడానికి,అలాగే రిస్క్ తగ్గించే దిశగా సమగ్ర మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు తెలిపింది.
వివరాలు
క్షీణించిన షేర్లు
ఈ వ్యాఖ్యలు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశ వివరాల సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
ఆర్‌బీఐ ప్రకటన ప్రభావంతో ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం వరకు పడిపోయాయి.
బీఎస్‌ఈలో ఆ కంపెనీ షేరు ధర రూ.2063కి చేరింది. ఐఐఎఫ్‌ఎల్ షేర్లు సుమారు 8 శాతం తగ్గగా, మణప్పురం ఫైనాన్స్ షేర్లు 3 శాతం, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ షేర్లు 4.7 శాతం మేర క్షీణించాయి.
ముత్తూట్ ఫైనాన్స్ జారీ చేసే రుణాల్లో దాదాపు 98 శాతం బంగారం తాకట్టుగా పెట్టి ఇచ్చేవే కావడంతో, ఆ సంస్థపై ప్రభావం తీవ్రంగా పడింది.
వివరాలు
బంగారు తాకట్టు రుణాల మంజూరుకు విధివిధానాలు
మణప్పురం సంస్థ మొత్తం రుణాల్లో సుమారు 50 శాతం భాగాన్ని, ఐఐఎఫ్‌ఎల్ సంస్థ 21 శాతం భాగాన్ని బంగారు తాకట్టు రుణాల రూపంలో కలిగి ఉన్నాయి.
బంగారు తాకట్టు రుణాల మంజూరుకు సంబంధించిన విధానాలు ఇప్పటివరకు ఒకే విధంగా పాటించకపోవడం ఆర్‌బీఐ గమనించింది.
అందువల్ల రుణ మంజూరు నుంచి నగదు వినియోగం, తాకట్టు ఆభరణాల వేలం వరకు ప్రతి దశకు సరైన విధివిధానాలను రూపొందించవచ్చని సూచనలు కనిపిస్తున్నాయి.