Payroll SIP Plan: ఇక జీతం నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి.. సెబీ కొత్త ప్లాన్ ఏమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం భారతదేశంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ప్రతి నెలా కొంత మొత్తాన్ని పెట్టుబడిగా మళ్లించే వారు ఎక్కువవుతున్నారు. అయితే, సిప్ తేదీకి బ్యాంక్ ఖాతాలో సరిపడ డబ్బులు లేకపోవడం, బ్యాంక్ అకౌంట్ మారినప్పుడు కేవైసీ అప్డేట్ సమస్యలు రావడం వంటి ఇబ్బందులు చాలామందిని వేధిస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ఉద్యోగుల పెట్టుబడి విధానంలో కీలక మార్పులు తీసుకురావాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) యోచిస్తోంది. ఉద్యోగుల జీతం నుంచే నేరుగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేసే విధానాన్ని తీసుకురావడానికి సెబీ తాజాగా ముసాయిదా ప్రతిపాదనలు విడుదల చేసింది.
వివరాలు
జీతం నుంచే నేరుగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
సెబీ ప్రతిపాదనల ప్రకారం, స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన కంపెనీలు, ఈపీఎఫ్ఓ పరిధిలో నమోదైన సంస్థలు, అలాగే అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తమ నెల జీతం నుంచే నేరుగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే అవకాశం పొందనున్నారు. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులు తమకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ పథకాలను ఎంచుకుని, జీతం నుంచి ఆటోమేటిక్‌గా పెట్టుబడి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవచ్చు. అవసరమైతే తర్వాత పథకాలను మార్చడం, లేదా పెట్టుబడిని ఎప్పుడైనా నిలిపివేయడం వంటి స్వేచ్ఛ కూడా ఉద్యోగులకు ఉంటుంది. ప్రస్తుతం ఈపథకంపై ఎలాంటి పన్ను రాయితీలు ప్రతిపాదించలేదు. ట్యాక్స్ చెల్లించిన తర్వాత చేతికి వచ్చే జీతం నుంచే ఈ పెట్టుబడులు జరగాల్సి ఉంటుంది.
వివరాలు
ఈ విధానం వల్ల లాభాలు ఏమిటి?
జీతం వచ్చిన వెంటనే పెట్టుబడి కట్ కావడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. "మిగిలితే పెట్టుబడి పెడదాం" అనే ఆలోచన తగ్గి, ముందుగానే సేవింగ్స్‌కు ప్రాధాన్యం పెరుగుతుంది. దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే బ్యాంక్ ఖాతాలో సరిపడ డబ్బులు లేక సిప్ పేమెంట్లు విఫలమయ్యే సమస్య ఉండదు. జీతం నుంచే నేరుగా మొత్తం కట్ కావడంతో ఆటోమేటిక్ పెట్టుబడులు సాఫీగా కొనసాగుతాయి. టెక్నాలజీ, కేవైసీ ప్రక్రియలు కష్టంగా అనిపించే కొత్త పెట్టుబడిదారులకు కూడా ఇది సులభమైన మార్గంగా మారుతుంది. అలాగే మార్కెట్ ఒడిదుడుకుల సమయంలో భయపడి సిప్ నిలిపివేయడం వంటి చర్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
వివరాలు
పరిమితులు కూడా ఉన్నాయి
అయితే ఈ విధానం అందరికీ వర్తించదు. ప్రధానంగా కార్పొరేట్ లేదా సంఘటిత రంగ ఉద్యోగులకు మాత్రమే ఇది అందుబాటులో ఉండే అవకాశం ఉంది. చిన్న, గుర్తింపు లేని సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని పొందలేకపోవచ్చు. అలాగే తరచూ ఉద్యోగాలు మారే వారు ప్రతి కొత్త సంస్థలో మళ్లీ పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాల్సి రావచ్చు. ఇది కొంత అసౌకర్యానికి దారితీయొచ్చు. ఇంటి అద్దె, లోన్ ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు వంటి ఖర్చుల కోసం నెల జీతంపైనే ఆధారపడే ఉద్యోగులకు ముందుగానే పెట్టుబడి కట్ కావడం వల్ల చేతిలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది.
వివరాలు
మార్కెట్ రిస్క్‌తో మానసిక ఒత్తిడి
పీఎఫ్ మాదిరిగా మ్యూచువల్ ఫండ్లలో స్థిరమైన రాబడులు ఉండవు. మార్కెట్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా పెట్టుబడి విలువ మారుతూ ఉంటుంది. దీంతో కొంతమంది పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మ్యూచువల్ ఫండ్ సంస్థలే పోర్ట్‌ఫోలియో నిర్వహణ చూసుకుంటాయి కాబట్టి పెట్టుబడిదారులు ప్రత్యేకంగా నిర్వహణ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. దీర్ఘకాలికంగా పెట్టుబడి కొనసాగిస్తే మంచి రాబడులు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.