
Boycott turkey: 'బాయ్‌కాట్ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై కఠిన చర్యలు తీసుకుంటుండగా, తుర్కియే దేశం పాకిస్థాన్‌కు బహిరంగ మద్దతు తెలపడం దేశంలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తుర్కియే వైఖరిపై వ్యతిరేకత ఉధృతమవుతూ, 'బాయ్‌కాట్ తుర్కియే' హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు మింత్రా, అజియో తుర్కీ బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేసి తమ వెబ్‌సైట్‌ల నుంచి వాటిని తొలగించాయి. 'బాయ్‌కాట్ తుర్కియే' ఉద్యమానికి వ్యాపార వర్గాలు కూడా మద్దతు తెలిపాయి. తుర్కియేతో ఉన్న వ్యాపార సంబంధాలను నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మింత్రా అధికారి తెలిపారు.
Details
బ్రాండ్ల అమ్మకాలు నిలిపివేత
రిలయన్స్ గ్రూప్ యాజమాన్యంలో ఉన్న అజియో సంస్థ 'కోటాన్', 'ఎల్‌సీ వైకికి', 'మావి' లాంటి తుర్కీ బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేసింది. అంతేకాదు, తుర్కియేలోని తమ కార్యాలయాన్ని కూడా మూసివేసినట్లు వెల్లడించింది. పాకిస్థాన్ మద్దతుతో పాటు అజర్‌బైజాన్ వంటి దేశాల వైఖరికి వ్యతిరేకంగా దేశంలోని పలు వాణిజ్య సంఘాలు స్పందించాయి. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (కెయిట్) తుర్కియే, అజర్‌బైజాన్ దేశాలతో వ్యాపార సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని పిలుపునిచ్చింది.
Details
అనుమతులను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
దేశీయ ఎగుమతిదారులు, దిగుమతిదారులు కూడా ఈ దేశాల్లోని కంపెనీలతో ఎలాంటి లావాదేవీలూ జరిపే ఉద్దేశం లేదని ప్రకటించారు. ఈ తరుణంలో తుర్కియేకు చెందిన సెలెబీ ఏవియేషన్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం భద్రతా అనుమతులను రద్దు చేసింది. ఈ ప్రభావంతో ఆ సంస్థకు చెందిన ఇస్తాంబుల్ షేర్ల విలువ క్రమంగా పడిపోతున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. తుర్కియే చర్యలపై విరుచుకుపడిన భారత ప్రజా సమాజం, వ్యాపారవర్గాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ దేశానికి వ్యాపార పరంగా తగిన బుద్ధి చెప్పే దిశగా కదులుతున్నాయి.