Myntra: క్విక్ కామర్స్‌లోకి మింత్రా.. 30 నిమిషాల్లో ఉత్పత్తుల డెలివరీ
ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా క్విక్ కామర్స్ రంగంలోకి ప్రవేశించింది. 'ఎం-నౌ'(M-NOW) పేరుతో కేవలం 30 నిమిషాల్లో ఉత్పత్తులను డెలివరీ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతానికి బెంగళూరులో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో ఈ సేవలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని మింత్రా సీఈవో నందిత సిన్హా తెలిపారు. వినియోగదారుల సమయాన్నిఆదా చేస్తూ,ఉత్పత్తుల కొనుగోలుకు సులభతరమైన పరిష్కారంగా ఎం-నౌను అభివృద్ధి చేశామని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ,దేశీయ బ్రాండ్లతో కూడిన లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను కేవలం 30 నిమిషాల్లో అందించేందుకు మింత్రా సన్నద్ధమైందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఫ్యాషన్,బ్యూటీ, యాక్సెసరీస్, గృహ విభాగాల్లో 10,000కి పైగా ఉత్పత్తులను అందిస్తున్న ఎం-నౌ,ఈ సంఖ్యను త్వరలో లక్షకు పైగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది.
మార్పిడి, వెనక్కి ఇచ్చే సౌకర్యం..
నవంబర్‌లో బెంగళూరులో క్విక్ కామర్స్ పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించిన మింత్రా, వినియోగదారుల నుంచి పొందిన సానుకూల స్పందనతో ఈ సేవలను మరింత విస్తరించనుంది. ఇతర క్విక్ కామర్స్ సంస్థలతో పోలిస్తే, మింత్రా ప్రత్యేకంగా ఉత్పత్తుల మార్పిడి, వెనక్కి ఇచ్చే సౌకర్యాన్ని కూడా అందిస్తుందని నందిత సిన్హా తెలిపారు. 2022లో మింత్రా మెట్రో నగరాల్లో ఎక్స్‌ప్రెస్ డెలివరీ సర్వీస్ ను ప్రారంభించి, ఆర్డర్ చేసిన 24 నుండి 48 గంటల్లో ప్రోడక్ట్ ను డెలివరీ చేస్తోంది. క్విక్ కామర్స్ రంగంలో బ్యూటీ, ఫ్యాషన్ విభాగాలను సమన్వయపరుస్తున్న సంస్థలతో పోల్చితే, ఈ రంగంలోకి అడుగుపెట్టిన తొలి ఫ్యా షన్ ప్లాట్‌ఫామ్ మింత్రా కావడం గమనార్హం.