LOADING...
ED case on Myntra: రూ.1654 కోట్ల విదేశీ పెట్టుబడులు.. ఎఫ్‌డీఐ నిబంధనల ఉల్లఘించిన మింత్రాపై ఈడీ కేసు
రూ.1654 కోట్ల విదేశీ పెట్టుబడులు.. ఎఫ్‌డీఐ నిబంధనల ఉల్లఘించిన మింత్రాపై ఈడీ కేసు

ED case on Myntra: రూ.1654 కోట్ల విదేశీ పెట్టుబడులు.. ఎఫ్‌డీఐ నిబంధనల ఉల్లఘించిన మింత్రాపై ఈడీ కేసు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2025
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఈ -కామర్స్ ప్లాట్ఫారం మింత్రా సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) కొరడా ఝుళిపించింది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలను ఉల్లంఘించిందని గుర్తించి,ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) కింద మింత్రా మీద కేసును నమోదు చేసింది. సంస్థ రూ.1654 కోట్ల మేర నిబంధనలకు వ్యతిరేకంగా లావాదేవీలు జరిపిందని ఆరోపణలున్నాయి. మింత్రాతో పాటు, దానికి అనుబంధంగా ఉన్న కంపెనీలు, అలాగే పలువురు డైరెక్టర్లపై కూడా అభియోగాలు నమోదు చేశారు. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం, మింత్రా,దాని అనుబంధ సంస్థలు హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం పేరుతో వాస్తవానికి మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇది ఎఫ్‌డీఐ నిబంధనలకు విరుద్ధమని ఈడీ స్పష్టం చేసింది.

వివరాలు 

మింత్రా,వెక్టర్ ఇ-కామర్స్.. ఒకే గ్రూప్‌కు చెందినవే

విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారంతో ప్రారంభమైన దర్యాప్తులో, మింత్రా డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హోల్‌సేల్ వ్యాపారానికే తమ కార్యకలాపాలు పరిమితమన్న ముసుగులో విదేశీ పెట్టుబడిదారుల నుంచి రూ.1,654.35కోట్లు సమీకరించినట్లు వెల్లడైంది. ఆ ఉత్పత్తులన్నింటినీ ప్రధానంగా వెక్టర్ ఇ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు విక్రయించినట్టు చెబుతుంది. ఆ వెక్టర్ సంస్థ, మింత్రా నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను సాధారణ వినియోగదారులకు అమ్మినట్లు గుర్తించారు. ఈ రెండు సంస్థలు - మింత్రా,వెక్టర్ ఇ-కామర్స్.. ఒకే గ్రూప్‌కు చెందినవే అని ఈడీ తన దర్యాప్తులో నిర్ధారించింది. హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారాల గురించి నిబంధనల ప్రకారం, అలాంటి సంస్థలు తమ ఉత్పత్తులలో కేవలం 25% వరకే తమ గ్రూప్‌కి చెందిన కంపెనీలకు విక్రయించవచ్చు.

వివరాలు 

నిబంధనలకు పూర్తిగా విరుద్ధం 

కానీ మింత్రా మాత్రం తన ఉత్పత్తులన్నింటినీ (100%) వెక్టర్ ఇ-కామర్స్‌కి విక్రయించి, చివరకు వాటిని రిటైల్ కస్టమర్లకు చేరేలా చేసింది. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని అధికారులు గుర్తించారు. ఈ ప్రక్రియ ద్వారా ఫెమా చట్టం ఉల్లంఘించబడిందని నిర్ధారించిన ఈడీ, సంబంధిత సంస్థలపై కేసు నమోదు చేసింది. దీనితో పాటు, మింత్రా గ్రూపులోని ఇతర అనుబంధ సంస్థలు మరియు వారి డైరెక్టర్లపై కూడా విచారణ కొనసాగుతోంది.