LOADING...
Infosys: 18,000 కోట్ల ఇన్ఫోసిస్ బైబ్యాక్‌కు దూరంగా నందన్ నీలేకని, సుధా మూర్తి.. 
18,000 కోట్ల ఇన్ఫోసిస్ బైబ్యాక్‌కు దూరంగా నందన్ నీలేకని, సుధా మూర్తి..

Infosys: 18,000 కోట్ల ఇన్ఫోసిస్ బైబ్యాక్‌కు దూరంగా నందన్ నీలేకని, సుధా మూర్తి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఇటీవల ప్రకటించిన రూ.18,000 కోట్ల విలువైన షేర్‌ బైబ్యాక్‌లో తాము పాల్గొనబోమని సంస్థ ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌కు చెందిన సభ్యులు.. నందన్‌ ఎం.నీలేకని, సుధా మూర్తి తదితరులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని వారు సెప్టెంబరు 14, 16, 17, 18, 19 తేదీల్లో సంస్థకు పంపిన లేఖల్లో తెలియజేసినట్లు ఇన్ఫోసిస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. కంపెనీ వివరాల ప్రకారం, బైబ్యాక్‌ ప్రకటన రోజున ప్రమోటర్లు కలిపి ఇన్ఫోసిస్‌లో 13.05% వాటా కలిగి ఉన్నారు. బైబ్యాక్‌ ప్రక్రియ అనంతరం, దానికి వచ్చిన స్పందన ఆధారంగా ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌ వాటాల్లో లేదా ఓటింగ్‌ హక్కుల్లో మార్పులు సంభవించే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది.

వివరాలు 

ప్రమోటర్ల వివరాలు:

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధా మూర్తి, కుమార్తె అక్షత మూర్తి, కుమారుడు రోహన్‌ మూర్తితో పాటు మరో సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని, ఆయన భార్య రోహిణి నీలేకని, పిల్లలు నిహార్‌, జాహ్నవి నీలేకని, అలాగే ఇతర సహ వ్యవస్థాపకులు, వారి కుటుంబ సభ్యులు సంస్థ ప్రమోటర్ల జాబితాలో ఉన్నారు. రూ.1800 చొప్పున బైబ్యాక్‌: ఇన్ఫోసిస్‌ చరిత్రలోనే అతిపెద్దదైన రూ.18,00 కోట్ల షేర్‌ బైబ్యాక్‌కు సెప్టెంబరు 11న జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. ఈ ప్రక్రియలో భాగంగా కంపెనీ 10కోట్ల ఫుల్లీ పెయిడ్‌ ఈక్విటీ షేర్లను ఒక్కో షేరు రూ.1800ధరకు తిరిగి కొనుగోలు చేయనుంది. ఈ బైబ్యాక్‌ మొత్తం కంపెనీ చెల్లింపైన ఈక్విటీ షేర్లలో 2.41శాతానికి సమానంగా ఉంటుంది.